జనసేన లో కూడా చేరికలు ఊపందుకుంటున్నాయి. ఈ చేరికలతో అటు వైసీపీ పెద్దలు.. ఇటు టీడీపీ పెద్దలు ఇలా జరిగిందేంటి..? అని ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో టీడీపీ, వైసీపీ నుంచి టికెట్లు రావనుకునే సిట్టింగ్లు, మాజీలు కూడా జనసేన వైపు చూస్తుండడం గమనార్హం. తాజాగా.. ఇద్దరు కీలక నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఇద్దరూ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
వీరితో పలువురు ద్వితియ శ్రేణి నాయకులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. ఈదర హరిబాబు సీనియర్ నేత. టీడీపీ స్థాపించిన తర్వాత పార్టీలో చేరి సుదీర్ఘకాలం పార్టీ కోసం కృషిచేశారు. 1994లో ఒంగోలు నుంచి టీడీపీ తరఫున పోటీచేసిన ఆయన 19వేల 879 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014లో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన ఈదర.. ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.
ఇక, టీవీ రామారావు విషయానికి వస్తే.. గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీలోనే ఉన్న రామారావు.. 2014 ఎన్నికల సమయంలో కేఎస్ జవహర్ విజయానికి కృషి చేశారు. అయితే.. జవహర్ మంత్రి అయ్యాక.. రామారావుకు ఆయనకు పొసగలేదు. ఇక, 2019లో తనే పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు.. విశాఖ నుంచి వంగలపూడి అనితను తీసుకు వచ్చి..ఇక్కడ పోటీకి దింపారు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన రామారావు.. వైసీపీ తరపున ప్రచారం చేశారు.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న తానేటి వనిత విజయంలో రామారావు కీలక పాత్ర పోషించారు. అయితే.. ఆ తర్వాత.. గతంలో ఉన్న ఆధిపత్య రాజకీయాలే చోటు చేసుకున్నాయి. దీంతో కొన్నాళ్లుగా రామారావు వర్గానికి వనిత వర్గానికి మధ్య తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. ఈ క్రమంలో అధిష్టానం తనకు నామినేటెడ్ పదవి ఇస్తుందని ఆశించినా.. ఫలితం దక్కలేదు. దీంతో రామారావు చివరకు పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లోఈయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఖాయమైంది.