టాలీవుడ్ కు చెందిన ప్రముఖులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగానికి చెందిన వారు రాజకీయ నాయకులు కాదని, కొందరికి కొన్ని పార్టీలతో సంబంధాలు, పరిచయాలు ఉన్నాయని పవన్ చెప్పారు. కొందరు తనకు మద్దతుగా ఉన్నా బయటికి రాలేకపోవచ్చని చెప్పారు. తనకు మద్దతుగా మాట్లాడితే వైసీపీ కక్ష సాధిస్తుందేమో అన్న భయంతో వారు రాకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కొద్ది ఎన్టీఆర్ ను, చంద్రబాబును రజనీకాంత్ పొగిడారని, ఆయనను కూడా వైసీపీ నేతలు తిట్టారని గుర్తు చేసుకున్నారు.
కాబట్టి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు తనకు బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినా తాను తప్పుగా భావించనని పవన్ అన్నారు. ఇక, ఎన్గీఏ నుంచి జనసేన బయటకు వచ్చింది అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై పవన్ మరోసారి స్పందించారు. బీజేపీ పెద్దలతో తనకు సత్సంబంధాలున్నాయని, సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, ఏదైనా కీలక అంశం ఉంటే వెల్లడిస్తానని చెప్పారు. ఏ పార్టీతో అయినా కలిసి ఉండటం లేకపోవడం తమ పార్టీ అంతర్గత విషయమని, వైసీపీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
ప్రజలకు న్యాయం చేయడమే రాజకీయ పార్టీల ప్రథమ కర్తవ్యం అని, తాను బహిరంగంగా ఏదైనా చెప్పేస్తానని, బిజెపి వారు ఇంకోరకంగా వ్యక్తపరుస్తారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన, టిడిపి, బిజెపి కచ్చితంగా కలిసి పోటీ చేస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని పవన్ తేల్చి చెప్పారు. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ ఏర్పాటుపై పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చంద్రబాబును కలిసిన తర్వాత పొత్తు గురించి ప్రకటన చేశానని, వాస్తవానికి ఆ ప్రకటన ఢిల్లీ నుంచి రావాల్సిందని పవన్ చెప్పారు. అయితే జి20 సమావేశాల సందర్భంగా అదును చూసి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, ఆ టైంలో మోడీ ఆ సమావేశాలలో బిజీగా ఉన్నారని చెప్పారు.