మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పేరు ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అయితే, తాను మైనింగ్ కొనసాగించేందుకు అనుమతివ్వాలని జగన్ ను గాలి అడగడం…వెంటనే ఆయన ఓకే చెప్పడంపై విమర్శలు వచ్చాయి. సుప్రీం కోర్టులో గాలిపై ఇంకా కేసులు విచారణలో ఉండగానే మరోసారి మైనింగ్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
గాలి జనార్ధన్ రెడ్డితోపాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా దాదాపు 12 సంవత్సరాల క్రితం కేసు నమోదైంది. కానీ, వాటి విచారణ మాత్రం కొన సాగుతూనే ఉండడంపై కూడా విమర్శలు వచ్చాయి. అంతేకాదు వారిపై దాఖలైన అసలు కేసుల విచారణ అటకెక్కిన రీతిలోనే..వారు వేసిన డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కూడా నత్తనడకన సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఈ పిటిషన్లలో తీర్పు రాకుండా ఉద్దేశపూర్వకంగానే నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే నిందితుల తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది. డిశ్చార్జ్ పిటిషన్లపై ఆగ్రహంగా ఉన్న సుప్రీంకోర్టు.. వాటిని తేల్చేందుకు డెడ్ లైన్ విధించింది.
నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ చేపట్టి ఈ నెల 29 లోగా తేల్చాలని ఆదేశించింది. ఇకపై వాయిదాలు కూడా ఇవ్వవద్దని సూచించింది. వీలైతే 29 కల్లా తీర్పులు కూడా ఇచ్చేయాలని సీబీఐ కోర్టుకు సూచించింది. సుప్రీం ఆదేశాలతో సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ వేగం పుంజుకున్నట్లయింది. ఆ డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్టు విచారణ పూర్తయితే గాలితో పాటు సబితా ఇంద్రారెడ్డికి కూడా చిక్కులు తప్పవు.