భారత టెన్నిస్ స్టార్ సానియా తన భర్త షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు రావడం.. ఐతే అదంతా ఒక టీవీ షో ప్రమోషన్లో భాగంగా చేసిన పబ్లిసిటీ స్టంట్ అని తేలడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ రచ్చ తర్వాత ఈ జంట అన్యోన్యంగానే ఉందని అనుకున్నారు అందరూ. కానీ ఈ రోజు ఓ షాకింగ్ విషయం బయటపడింది. షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకొని పెళ్లి ఫోటోలతో మీడియాలోకి వచ్చేశాడు. షోయబ్ పాకిస్థాన్ నటి సనా జావెద్ ను రెండో వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ సంబంధం ఉందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా పెళ్లి ఫోటోలతో ప్రత్యక్షమైంది ఈ జంట.
సానియా మీర్జాకు ఓ హైదరాబాద్ అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరిగి అది రద్దు కావడం.. మరోవైపు షోయబ్ మరో హైదరాబాద్ అమ్మాయితో పెళ్లి దాకా వెళ్లి వెనక్కి రావడం.. చివరికి వీళ్ళిద్దరూ ప్రేమలో పడి 2010లో పెళ్లి చేసుకోవడం తెలిసిన సంగతే. అయితే పెళ్లి తర్వాత షోయబ్, సానియా ఎన్నడూ ఒకే చోట కలిసి ఉన్నది లేదు. వారి వారి కెరీర్లలో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు దుబాయిలో కలిసేవారు. ఎప్పుడో ఒకసారి షోయబ్ హైదరాబాద్ వచ్చేవాడు.. సానియా పాకిస్థాన్ వెళ్ళేది. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. కాగా కొన్నేళ్ల నుంచి షోయబ్ సానియాల మధ్య సాన్నిహిత్యం కనిపించట్లేదు. ఇద్దరు విడిపోనున్నారనే వార్తలు వచ్చాయి. కట్ చేస్తే.. విడాకుల గురించి ఇంకా అధికారికంగా ఏ సమాచారం రాకముందే షోయబ్ మరో పెళ్లి చేసుకున్నాడు. బహుశా ఇప్పటికే ఇద్దరు విడాకులు తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. లేదంటే ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహు భార్యత్వం తప్పు కాదు కాబట్టి విడాకులు తీసుకోకుండానే షోయబ్ మరో పెళ్లి చేసుకుని ఉండొచ్చు.