వైసీపీ ప్రధాన కార్యదర్శి, గత జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. `రండి… విచారించాల్సి ఉంది`అని నోటీసుల్లో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30కు మంగళగిరి పోలీసు స్టేషన్కురావాలని ఆయనకు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో సజ్జల కూడా నిందితుడిగా ఉన్నారు. ఈయనను 120 నిందితుడిగా పేర్కొన్నారు. అయితే.. తర్వాత.. ఈ కేసులో ఆయన పాత్రను ప్రధానంగా పేర్కొంటూ మంగళగిరి పోలీసులు ప్రభుత్వానికి నివేదికసమర్పించారు.
అసలు మాస్టర్ మైండ్ సజ్జలేనని పేర్కొన్నారు. “మీకే ఫర్లేదు. అంతా నేను చూసుకుంటా!“ అని భరోసా ఇచ్చిన నేపథ్యంలోనే కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారన్నది పోలీసుల కథనం. దీంతో సజ్జలను విచారిస్తే.. తప్ప… కీలక విషయం బయటకు పొక్కే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో కొన్నాళ్ల కిందటే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అదికారులు సజ్జలను అడ్డుకుని(ఆయన విదేశాల నుంచి వస్తున్నట్టు చెప్పారు. కానీ, ఆయన విదేశాలకు పారిపోతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ మిస్సయింది) ఏపీకి పంపించారు.
ఇక, తాజగా మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చారు. దీంతో సజ్జల విచారణకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే.. వైసీపీలో జరుగుతున్న తాజా చర్చల ప్రకారం.. ఈ కేసులో సజ్జల అప్రూవర్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోం ది. ఎందుకంటే.. జగన్‌కు , సజ్జలకు మధ్య అభిప్రాయ బేధాలు కొనసాగుతున్నాయని.. దీంతో ఈ కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లడం కంటే.. తాను అప్రూవర్‌గా మారి.. కొంతలో కొంతైనా.. నిజాయితీ నిరూపించుకుంటే.. పరువుదక్కుతుందని సజ్జల భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన అప్రూవర్‌గా మారినా ఆశ్చర్యంలేదని పార్టీలోని కీలక నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.
అయితే.. ఇదే జరిగితే.. వైసీపీ మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉంది. సజ్జల నిజాలు చెబితే.. అది పార్టీ అధినేత మెడకు చుట్టుకుంటుందని.. రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ఇక, అప్రూవర్‌గా మారితే.. సజ్జలపై కేసు తీవ్రత కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ఆయన నిజంగానే అప్రూవర్‌గా మారతారా? లేదా? ప్రస్తుతం జరుగుతున్నది రాజకీయ చర్చేనా? అనేది తేలాలంటే.. కొన్నిరోజులువెయిట్ చేయక తప్పదు.