అల్లు అర్జున్ ఒకప్పుడు స్టేజ్ మీద మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడినా, తన సినిమాల్లో చిరంజీవి రెఫరెన్సులు పెట్టినా ఎవరికీ అంత ఆశ్చర్యంగా అనిపించేది కాదు. కానీ ఈ మధ్య మాత్రం బన్నీ బయట ఎక్కడైనా చిరు ప్రస్తావన తెచ్చినా.. సినిమాల్లో కూడా చిరు రెఫరెన్సులు పెట్టినా క్యూరియస్‌గా చూస్తున్నారు. అలా మారిపోయాయి పరిస్థితులు. ‘ పుష్ప’ సినిమాలో ఒక సీన్లో చిరు సినిమా ‘చూడాలని ఉంది’ రిలీజ్ డే థియేటర్ దగ్గర ఓ సీన్ ఉంటుంది.
ఆ సీన్లో చిరు కటౌట్ చూసినపుడు కోలాహలం కనిపించింది థియేటర్లలో. ‘పుష్ప-2’ దీన్ని మించి చిరుకు ఎలివేషన్ ఉంటుందట. దాని గురించి ఆసక్తికర చర్చ నడుస్తోందిప్పుడు. ‘పుష్ప: ది రైజ్’ కథ ‘చూడాలని ఉంది’ రిలీజ్ టైంలో నడుస్తున్నట్లు చూపిస్తే.. ‘పుష్ప: ది రూల్’లో ‘ఇంద్ర’ సినిమా రోజుల్లో కథ నడిచేట్లు చూపించబోతున్నాడట సుకుమార్.
అంతే కాక ‘ఇంద్ర’ సినిమా రిలీజ్‌కి చిత్తూరు జిల్లాలోని ఓ థియేటర్ ముందు ‘పుష్పరాజ్-చిరు యువసేన’ అని ఫ్లెక్సీ పెట్టి చిరు-పుష్ప మ్యూచువల్ ఫ్యాన్స్ సందడి చేసేట్లు చూపించబోతున్నారట.
‘చూడాలని ఉంది’ వచ్చింది 1998లో. అప్పటికి పుష్ప ఒక సాధారణ వ్యక్తి. అప్పుడే ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగి ఉంటాడు. ఐతే ‘ఇంద్ర’ రిలీజ్ టైంకి అతను పెద్ద డాన్‌లా ఎదిగిపోయి ఉంటాడు. అందుకే పుష్పరాజ్-చిరు యువసేన అని బేనర్ కూడా పెట్టి ఉండొచ్చు. ఒక రకంగా హీరో ఎదుగుదలను చూపించడానికి చిరు సినిమాలనే రెఫరెన్సుగా వాడుకోబోతున్నాడన్నమాట సుకుమార్. ఇది కథను ఆసక్తికరంగా మార్చడంతో పాటు మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చే విషయం అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది. బన్నీ జాతీయ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లగా.. ఆ టైంలో అతడితో సంబంధం లేని సీన్లను తీస్తోంది సుకుమార్ టీం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.