ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పదే పదే పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. మొన్నామధ్య విజయవాడలో పోలీసుల బట్టలిప్పదీస్తా అంటూ చిందులు తొక్కిన జగన్.. తాజాగా రాప్తాడులోనూ అదే చందంగా మాట్లాడారు. పోలీసులు చంద్రబాబుకు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారని.. మేము అధికారంలోకి వచ్చాక మీ బట్టలూడదీస్తాం.. యూనిఫామ్ విప్పించి నిలబెడతాం.. ఉద్యోగాలు లేకుండా చేస్తామంటూ విరుచుకుపడ్డారు. దీంతో జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘాలు ఇప్పటికే ఖండించాయి. అవేం మాటలంటూ మండిపడుతున్నాయి.
అయితే ఈ విషయంలో జగన్ కు వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఏమందంటే.. `మేము అధికారంలోకి వస్తాం.. వచ్చాక బట్టలు ఊడదీస్తాం. బట్టలు ఊడదీసి ఏం చూస్తార్రా నాయనా? మాట్లాడితే బట్టలిప్పదీస్తాం.. బట్టలిప్పదీస్తాం అంటున్నారు.. బట్టలిప్పదీసి ఏం చేస్తావ్? ఏం చూస్తావ్? మొలతాడు చూస్తారు. ఇంకా చూడాలనుందా? ప్రతివాడు అదే మాట.. బట్టలిప్పదీసి కొడతా అంటారు.. ఏం బట్టలు ఉంచి కొట్టొచ్చుగా..! నువ్వు జనాలకు ఏం చేస్తావో చెప్పు. ఏం మంచి చేస్తావో చెప్పు. అది చెప్పకుండా బట్టలూడదీస్తా.. అది తీస్తా.. ఇది తీస్తా.. అందులో పెడతా.. ఇందులో పెడతా.. ఎందులో పెడతార్రా నాయనా! ` అంటూ మీడియా ముందు పోసాని ఆవేశంగా మాట్లాడుతూ కనిపించారు.
ప్రస్తుతం పోసాని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న పోసాని.. జగన్ ను ఇంతలా టార్గెట్ చేశారంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. పోసాని కౌంటర్ ఇవ్వడం నిజమే. కానీ ఆ కౌంటర్ జగన్ కు కాదు. కూటమి అధికారంలోకి రాకముందు ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా బట్టలూడదీసి కొడతానంటూ వైసీపీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయంలో పోసని పవన్ ఉద్ధేశించి చేసిన కామెంట్స్ ఇవి. మరికొందరు వైసీపీ నాయకులు కూడా అప్పట్లో పవన్ చేసిన బట్టలూడదీస్తామనే డైలాగ్స్‌పై సెటైర్లు పేల్చారు. ఇప్పుడు జగన్ అవే మాటలు మాట్లాడినా వైసీపీ నేతలు నోరు మెదపని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొందరు టీడీపీ అభిమానులు పోసాని జగన్ కు కౌంటర్ ఇచ్చినట్లుగా వీడియోను వైరల్ చేస్తున్నారు.
బట్టలు ఊడదీసి ఏమి చూస్తావ్ జగన్ ? – పోసాని
"మాట్లాడితే అందరి బట్టలు ఊడదీస్తా అంటున్నావ్. ఊడదీసి ఏమి చూస్తావ్ జగన్ ? " జగన్ పై ఆగ్రహంతో ఊగిపోయిన పోసాని. ఇటీవమే పోసాని జైలు జీవితం అనుభవించి వచ్చిన సంగతి తెలిసిందే.. pic.twitter.com/brdpfbkVXM
— Swathi Reddy (@Swathireddytdp) April 8, 2025