ఏపీలో జనసేన, బీజేపీల మధ్య గ్యాప్ వచ్చిందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, జనసేనతో తమకు మంచి సంబంధాలున్నాయని, తమ మైత్రి కొనసాగుతూ…..ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. కానీ, 2024 ఎన్నికల్లో జనం టీడీపీ వైపు మొగ్గే అవకాశాలు కూడా ఉండడంతో జనసేన అధినేత పవన్ ను బీజేపీ పెద్దల కాస్త దూరం పెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులోనూ, ఏపీలో బీజేపీ చేపట్టే కార్యక్రమాలకు పవన్ ను ఆహ్వానించకపోవడంతో జనసేనాని, జనసైనికులు గుర్రుగా ఉన్నారు. అందుకే, రాబోయే ఎన్నికల్లో తమతో బీజేపీగానీ, మరే ఇతర మిత్రపక్షంగాని కలిసి రావాల్సిందేనని, తాము ఎవరి షరతులకు తలొగ్గమని పవన్ తేల్చేశారు కూడా.
జగన్ ను గద్దె దించడమే లక్ష్యమని, కేంద్రం నుంచి రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని పవన్ ఇటీవల ప్రకటించారు. కానీ, ఏపీ బీజేపీ పెద్దలు మొదలు బీజేపీ హై కమాండ్ వరకు ఎవరూ ఆ రోడ్ మ్యాప్ ఊసే ఎత్తడం లేదు. ఇంకా చెప్పాలంటే పవన్ కల్యాణ్‌కు బీజేపీ పెద్దలు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనే టాక్ కూడా ఉంది. దాంతోపాటు, ఏపీ బీజేపీలోని కొందరు నేతలు వైసీపీకి లోపాయికారీగా సహకరిస్తున్నారని పవన్ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కరోనా వల్ల జనసేన-బీజేపీల మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పిన పవన్….కరోనా తగ్గుముఖం పట్టినా ఆ గ్యాప్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఏ ఉమ్మడి పోరాటంలోనూ రెండు పార్టీలు కలిసి కనిపించడం లేదు. అంతెందుకు, తిరుపతి లోక్ సభ బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్ధతుగా పవన్ బహిరంగ సభలో పాల్గొని మరీ గెలిపించాలని కోరారు. కానీ, బీజేపీ బరిలోకి దిగిన ఆత్మకూరు ఉప ఎన్నిక ఊసు కూడా పవన్ ఎత్తలేదు. రాజమండ్రిలో బీజేపీ నిర్వహించిన ‘గోదావరి గర్జన’కూ పవన్ ను పిలవలేదు. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్ కు ఆహ్వానం అందకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్ కు తాము ఫోన్ చేసి చెప్పామని బీజేపీ నేతలు అంటున్నారు.
ఇక, ముఖ్యంగా జనసేనకు బీజేపీ ఆర్థికంగా దన్నుగా నిలుస్తుందని పవన్ భావించారని, కానీ, అది కూడా జరగడం లేదని, దీంతో, పవన్ గతంలో మాదిరిగానే తన సినిమాల రెమ్మున్ రేషన్ డబ్బులను పార్టీ కోసం ఖర్చుపెట్టుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు పవన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని చెబుతున్నారు. అక్టోబరు 5వ తేదీన విజయ దశమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు పవన్ శ్రీకారం చుట్టబోతున్నారని, అదే రోజు బీజేపీకి రాం రాం చెబుతారని పుకార్లు వినిపిస్తున్నాయి.