సామాన్యులకు అండంగా నిలిచే నిజమైన ప్రజాసేవకుడు మంత్రి నిమ్మల రామానాయుడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదు రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరు కు పడిన గండ్ల పూడిక పనుల్లో నిమ్మల నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. గట్టు వద్దనే ఉంటూ దగ్గరుండి ఏజెన్సీలతో పనులు చేయిస్తున్నారు.
ఈదురు గాలులతో కూడిన జోరు వాన కురుస్తున్నా, చీకట్లు కమ్ముకున్నా నిమ్మల మాత్రం తగ్గేదే లే అంటున్నారు. వర్షంలోనే తడుస్తూ పనులకు ఆటంకం లేకుండా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులు చేపట్టిన ఏజెన్సీకి, అధికారులకు తగు సూచనలు ఇస్తున్నారు. వర్క్ ప్రోగ్రెస్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకు అప్డేట్ చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి గట్టు పైనే గడుపుతున్న మంత్రి రామానాయుడు.. అక్కడే టిఫిన్, భోజనం చేస్తున్నారు.
అత్యంత వేగంగా గండ్లు పూడ్చి బెజవాడ వాసుల్లో భయం తొలగించాలని నిమ్మల కృషి చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ సింగ్ నగర్‌ను ముంపునకు కారణమైన మూడు గండ్లలో రెండు గండ్లు పూడ్చడం జరిగింది. కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపాదికన రెడీ చేశారు. మిలిటరీ సైతం సహకరించడంలో మూడో గండి పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. మూడో గండిని పూడ్చిన తర్వాత తాను ఇంటికి వెళ్తానని.. అప్పటి వరకు డ్యూటీ దిగేదే లేదని మంత్రి నిమ్మల అంటున్నారు. దగ్గరుండి చేయిస్తేనే ఏ పనైనా త్వరగా అవుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, నిమ్మలను చూసిన ప్రతి ఒక్కరు ఆయన పని పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధిని మెచ్చుకుంటున్నారు. పొలిటికల్ లీడర్ అంటే ప్రజల సొమ్ము దోచుకోవడానికి కాదు.. ప్రజల సమస్యలు తీర్చడానికి అని నిమ్మల నిరూపించారని అంటున్నారు.