జనసేన నాయకుడు, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు కు రాజ్యసభ సీటు ఖరారు అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బీసీ సంఘం నేతం ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజ్యసభ సభ్యత్వం కోసం కూటమి నాయకులు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
భారీ పోటీ ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున తన అన్న నాగబాబును పెద్దల సభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై తాజాగా నాగబాబు స్పందించారు. నా నాయకుడికి సేవ చేయడం తప్ప.. రాజ్యసభకు వెళ్లాలనే ఆశయం నాకు లేదంటూ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు.
`అతను స్వార్థం తెలియని ప్రజా నాయకుడు, అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే, వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన పర్పస్ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాలకోసం. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు ఎటువంటి రాజకీయ ఆశయం లేదు` అంటూ పవన్ ను ఉద్ధేశించి నాగబాబు ట్వీట్ చేశారు.