న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం `హిట్ 3: ది థర్డ్ కేస్` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ మూవీలో నాని చాలా వైల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. సమ్మర్ కానుకగా మే1న పాన్ ఇండియా స్థాయిలో హిట్ 3 రిలీజ్ కాబోతుంది. గతంలో వచ్చిన హిట్ 1, హిట్ 2 చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేయడంతో హిట్ 3పై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి.
ఈ సంగతి పక్కన పెడితే.. 2020వ సంవత్సరంలో వచ్చిన `హిట్:ది ఫస్ట్ కేస్` ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇంటెన్స్ యాక్టింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన `హిట్ 2: ది సెకండ్ కేస్`లో విశ్వక్ సేన్ కాకుండా అడివి శేష్ ని లీడ్ రోల్ లో కనిపించాడు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. కాకపోతే ఆ సమయంలో ఓ వార్త బాగా వైరల్ అయింది.
హీరో విశ్వక్ సేన్, నాని మధ్య గొడవలు జరిగాయని.. అందుకే హిట్ 2లో విశ్వక్ ను కాదని శేష్ ను హీరోగా తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో నాని నోరు విప్పాడు. స్క్రిప్ట్ ఐడియా కారణంగా జరిగిన మార్పులే తప్ప.. విశ్వక్ సేన్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని నాని స్పష్టత ఇచ్చాడు.
`హిట్ సినిమాకి సెకండ్ పార్ట్ అనుకున్నప్పుడు అందరం విశ్వక్ సేన్ తోనే చేయాలని అనుకున్నాం. కానీ స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయ్యాక తెలంగాణ హిట్ కాస్తా ఆంధ్రా హిట్ అయింది. అప్పుడు ఇంకో కాప్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. సీక్వెల్ మాదిరిగా కాకుండా, దీన్ని ఒక యూనివర్స్ మాదిరిగా తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాం. ఆ కారణంగానే హిట్ 1లో విశ్వక్, హిట్ 2లో శేష్ ఉన్నాడు. హిట్ 3 నేను చేశాను. తప్పకుండా రాబోయే సినిమాల్లో విశ్వక్, శేష్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు` అంటూ నాని చెప్పుకొచ్చారు.