పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ హత్యను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారు. రషీద్ ను నడిరోడ్డుపై జిలానీ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. రషీద్ వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ కాగా.. అతన్ని చంపిన జిలానీ కూడా వైసీపీనే. వ్యక్తిగత విభేదాలతో ఇద్దరూ చంపుకునే స్థాయికి వెళ్లారు. జిలానీ చేతుల్లో రషీద్ అత్యంత దారుణంగా చంపబడ్డాడు. ఈ ఘటనపై టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య బిగ్ వార్ నడుస్తోంది.
శుక్రవారం రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. అనంతరం మీడియాతో మాట్లాడాడు. రాష్ట్రంలో లా-అండ్-ఆర్డర్ లేదనడానికి వినుకొండలో రషీద్ హత్యే నిదర్శనమంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దారుణాలు జరుగుతూనే ఉన్నాయని విమర్శలు చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో 24న వైసీపీ ధర్నా చేస్తుందని జగన్ ప్రకటించారు.
అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలపై జనసేన నేత కొణిదెల నాగబాబు కౌంటర్ ఇచ్చారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదు.. జగన్ శవ రాజకీయాలు మానుకుంటే బెటర్ అని నాగబాబు సూచించారు. జగన్ పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే కొట్టారు.. ప్రతిపక్ష నేతల గొంతెత్తితే కేసులు పెట్టారని నాగబాబు గుర్తు చేశారు.
అమాయకులైన ప్రజలను, అధికారులను బలి తీసుకున్నారు.. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు.. అధికారంలో ఉన్నప్పుడేమో అరాచకాలు చేసి, ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారంటూ నాగబాబు మాజీ సీఎంను ఎద్దేవ చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా… ఇంకా మీ బుద్ధి మార్చుకోవడం లేదని కౌంటర్ వేశారు. వ్యక్తిగత గొడవలతో జరిగిన హత్యకు రాజకీయ రంగులు పులిమి తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని జగన్ పై నాగబాబు ఫైర్ అయ్యారు.