ఏపీలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఫ్యాన్ గాలికి బ్రేకులు వేసి కూటమి వైపు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని సాధించిన వైకాపా ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పాకులాడటం ప్రారంభించారు. ఇందులో భాగంగానే అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి జగన్ సంచలన లేఖ రాశారు.
అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం సభ నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్టు ఉందని జగన్ లేఖలో పేర్కొన్నారు.
విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదని జగన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని.. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడుని అభ్యర్థించారు.
అయితే జగన్ లేఖ పై తాజాగా మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ మాజీ సీఎంకు కౌంటర్ ఇచ్చారు. 11 సీట్లు సంపాదించుకున్న జగన్ కు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అసలు సభ అంటే జగన్ కు గౌరవం ఉందా? అని ఆమె నిలదీశారు. సొంత పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తుండగా జగన్ సభలో నుంచి వెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నికకు కూడా జగన్ రాలేదని.. స్పీకర్ కు కనీస గౌరవం ఇవ్వలేదని సంధ్యా రాణి మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం రోజున జగన్ తన పేరునే మర్చిపోయారని సంధ్యారాణి ఎద్దేవ చేశారు. తన పేరే తనకు గుర్తులేని వ్యక్తికి, సభపై గౌరవం లేని వ్యక్తికి ప్రతిపక్షం కావాలా? అంటూ మీడియాతో జగన్ ను ఉద్దేశిస్తూ సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు.