గతానికి భిన్నంగా హైదరాబాద్ మహానగరంలో తరచూ ఏదో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటోంది. సికింద్రాబాద్ పరిధిలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఇప్పటికే ఐదుకు పైగా భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవటం.. పలువురు దుర్మరణం పాలు కావటం తెలిసిందే. తాజాగా మరో పేలుడుతో కూడిన అగ్నిప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున నాలుగైదు గంటల ప్రాంతంలో కింగ్ కోఠిలోని ఒక మెకానిక్ షెడ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ మంటల్లో ఒక వ్యక్తి సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. అతడు ఎవరు? అన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సెక్యురిటీ గార్డుగా భావిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున భారీ శబ్దంతో మంటలు చెలరేగటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున అందరూ నిద్రలో మునిగి ఉన్న వేళ.. పెద్ద శబ్ధం చోటు చేసుకోవటంతో ఒక్కసారిగా మెలుకువ వచ్చింది. చుట్టు పక్కల ప్రాంతాల వారు లేచి చూడగా.. మంటలతో కారు షెడ్డు తగలబడుతున్న సీన్ కళ్లకు కనిపించింది.
షెడ్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. డీజిల్.. పెట్రోల్ తో పాటు.. టైర్లు.. కార్లు ఉండటంతో వరుస పెట్టి పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్నఅగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్నిఅదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో ఐదు కార్లు పూర్తిగా తగలబడినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
షార్ట్ సర్క్యుట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని.. పేలుడు.. మంటలు పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉండటంతో అగ్నిప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు. మంటలు.. దట్టమైన పొగతో ఆ ప్రాంతం నిండుకుంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు.