ఈ దేశపు శ్వాస వీరుడిది..ఈ దేశపు నడక వీరుడిది..వందనాలు చెల్లించి చేసే ప్రయాణంలో..ఒక్కో అడుగు ఆత్మ విశ్వాసానికి ప్రతీక అయితే చాలు..అనండిక మేరా భారత్ మహాన్ అని ! ఈ దేశం వీరులను మాత్రమే తన ఒడిలో దాచుకుని కొత్త చరిత్రకు శ్రీకారం ఇస్తోంది. మీరు చదవాలి మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని.. ఏమీ ఆశించని ఆ తల్లిదండ్రుల గొప్పదనాన్ని.. తెలుసుకోవాలి..
కొన్ని నిక్షిప్త కాలాల చెంత మేజర్ ఓ గొప్ప అమర గీతం. చావు లేని జీవితం.. ఆయనకే సొంతం. ఆయన తల్లిదండ్రులు కె.ఉన్నికృష్ణన్, ధనలక్ష్మీ ఉన్నికృష్ణన్ మేజర్ ఆశయ సాధనే ధ్యేయంగా ఉన్నారు. అందుకే సినిమా తీశాం మీక్కాస్త డబ్బులిస్తాం అంటే ఆ రాయల్టీని వద్దని చెప్పి, ఏమనుకుంటున్నారు మా గురించి అని సున్నితంగా మందలించి పంపారు ఆ చిత్ర నిర్మాతలను. మన జీవితాల్లో మేజర్ ఉన్నాడా.. ? ముంబయిదారుల్లో..తాజ్ హోటల్ గదుల్లో మేజర్ ఉన్నాడా ? కనీసం రోజుకు ఒక్కసారి అయినా గుర్తుకువస్తున్నాడా.. ఆ ఉగ్ర మూకల్ని మట్టు పెట్టిన సాహసి నిత్య స్మరణీయుడు కదా ! మరువకండి.. ఆయన్ను..
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా సినిమా వచ్చింది. మేజర్ పేరిట ఆ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. 26 /11 ముంబయి దాడుల నేపథ్యంలో ఆ సైనికాధికారి సాహసం నేపథ్యంలో ఆయన జీవిత కథ తెరకెక్కింది. ఈ సినిమాను అడవి శేష్ , శశి తిక్కా కథ, దర్శకత్వంలో హీరో మహేశ్ బాబు నిర్మించారు. ఇప్పుడీ సినిమా విషయమై ఓ గొప్ప విషయం వెలుగు చూసింది.
బయోపిక్ కదా ! సినిమాకు సంబంధించి వచ్చే ఆదాయంలో కొంత మొత్తం రాయల్టీగా ఆ తల్లిదండ్రులకు చెల్లించాలని చూశారు నిర్మాతలు. వాళ్లేమన్నారో తెలుసా .. “గెట్ ఔట్ ఫ్రమ్ మై హోం” అని అన్నారు. ఇది కదా కావాలి. “మేం మా కొడుకు జీవితాన్ని కాసులతో తూకం వేయాలని అనుకోవడం లేదు” అని చెప్పారు. తమకేమీ వద్దని చెప్పి పంపారు ఆ వృద్ధ తల్లిదండ్రులు. అంతేకాదు మేజర్ పేరిట వచ్చిన జీవిత బీమా సంస్థ అందించిన డబ్బులు కూడా తమ దగ్గరి వారికి పంచేశారని తెలుస్తోంది. అందుకే చిత్ర నిర్మాతలు సైన్యంలో చేరే యువతకు తమవంతుగా సాయం చేస్తామని అంటోంది.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను మనం మరిచిపోతున్నాం. కేవలం దరిద్రగొట్టు రాజకీయాలతో కాలం వెచ్చింపు చేస్తున్నాం. కానీ వాళ్లు ఇంకా దేశం కోసం ఆలోచిస్తున్నారు. ఈ మట్టి కోసం ఈ మనిషి ఉనికి కోసం ఆలోచిస్తున్నారు. ఎవరు గొప్ప? రెండున్నర గంటల సినిమా ఏం చెప్పింది అనే కన్నా..ఓ గొప్ప జీవితం, వీరుని జీవితం ఏ విధంగా ఆదర్శనీయం అయిందో అని ఆలోచిస్తే మనం అంతా ఆ వీరుని దగ్గర, ఆయన పాదాల దగ్గర ఆ పాద ధూళి దగ్గర చిన్నవారం. మేజర్ జీవితం, సాహసం ఈ వారాంతపు వేళ కూడా థియేటర్లలో ఓ సినిమా రూపంలో ఉంటుంది. కానీ రేపటి వేళ ? ఏమౌతుంది.
పాపం ! ఆ తల్లిదండ్రులు ఇంకా దేశం కోసమే తమ జీవితాలను వెచ్చింపు చేస్తూ, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా రు. కానీ మనం పనికిమాలిన రాజకీయపు కొట్లాటలకు కాలం వెచ్చింపు చేస్తున్నాం. చెప్పానుగా మనం వాళ్ల దగ్గర చాలా చిన్నవాళ్లం..అని! మరుగుజ్జు తనం మనలోనే ఉంది. అదిపోతేనే మన దేశం బాగుపడడం ఖాయం.