సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా రంజక పాలన సాగిస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరిణతి, అనుభవం లేని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో సీఎంలు స్వతంత్రంగా వ్యవహరించలేరని, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దల ఆదేశాల కోసం ఎదురుచూడాల్సిందేనని లక్ష్మీపార్వతి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం అంత సులువు కాదని, ఎన్నికలలో హామీలు ఇవ్వడం చాలా సులువని లక్ష్మీపార్వతి అన్నారు. తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అన్ని రంగాలలో ముందంజలో నిలిపారని ప్రశంసించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి ఎన్నో హామీలను అమలు చేసి కేసీఆర్ సుపరిపాలన అందించాలని కొనియాడారు.
అయితే, రేవంత్ రెడ్డి మాజీ టిడిపి నేత కావడం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరుండడం వంటి కారణాల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై లక్ష్మీపార్వతి ఈ రకంగా తన అక్కసు వెళ్ళగక్కారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.