హఠాత్తుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటుపై మంత్రి కేటీఆర్ కు ప్రేమ పెరిగిపోయింది. స్టీల్ ప్లాంటును ఎట్టి పరిస్థితుల్లోను అమ్మొద్దని, ప్లాంట్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్లాంటుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ విస్తరణ ప్రణాళికలో ప్లాంటును చేర్చాలని నరేంద్రమోడీకి సూచించారు. ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా కేటీయార్ కేంద్రానికి రాసిన బహిరంగ లేఖ ఇపుడు ఏపీలో చర్చనీయాంశమవుతోంది.
అసలు ఇంత హఠాత్తుగా స్టీల్ ప్లాంట్ పై కేసీయార్ కు ఎందుకింత ప్రేమ పొంగిపోయింది ? ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూడా బీఆర్ఎస్ పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు అది కూడా అడ్డుగోలు విభజనకు కారకుడైన కేసీయార్ అంటే ఏపీ జనాల్లో బాగా మంటుంది. టీఆర్ఎస్ గా ఉన్నంతవరకు ఏపీ జనాలను ఎంత అవమానించాలో అంతా అవమానించారు.
సమయం, సందర్భం లేకుండానో ఏపీ జనాలపైన నోటికొచ్చింది మాట్లాడేవారు. అలాంటిది టీఆర్ఎస్ కాస్త జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారేటప్పటికి ఏపీ మీద ప్రమే చూపిస్తున్నారు. ఎందుకంటే జాతీయపార్టీగా బీఆర్ఎస్ నిలదొక్కుకోవాలంటే ఏపీలో కూడా ఓట్లు, సీట్లు అవసరం. అందుకనే ఏపీ విషయాలపైన కేసీయార్, కేటీయార్, మంత్రులు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ కు మద్దతు పలుకుతున్నది.
స్టీల్ ప్లాంట్ అంశం సెంటిమెంటుతో కూడినది. స్టీల్ ప్లాంట్ పై గట్టిగా మాట్లాడినా, పోరాటాలు చేసినా ఉత్తరాంధ్రలోని మూడుజిల్లాల ప్రజలు తమకు అండగా ఉంటారని కేటీయార్ భావించినట్లున్నారు. అందుకనే ఉన్నట్లుండి స్టీల్ ప్లాంట్ పై ప్రేమ కురిపిస్తున్నారు. చూడబోతే విశాఖ స్టీల్స్ కు మద్దతుగా కేంద్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వైజాగ్ లో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రకటించినా ఆశ్చపడక్కర్లేదు. ఎందుకంటే రాబోయేదంతా ఎన్నికల కాలమే కదా. ఓట్లు, సీట్ల కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుంది.