విజయవాడ వరద ఉధ్రుతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. మరోవైపు సహాయక చర్యల్లోనూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంకోవైపు.. వరదలో కొట్టుకు వస్తున్న డెడ్‌బాడీలు సర్కారుకు మరింత సంకటంగా మారాయి. దీంతో విజయవాడ విషయంపై సీఎం చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు. ఇంకోవైపు… ఆయనకు కృష్నాజిల్లాలోని కొల్లేరు సరస్సు కూడా మరింత టెన్షన్ పెడుతోంది. కొల్లేరుకు కూడా వరద ప్రవాహం పెరుగుతుండడం.. ఇక్కడ నుంచి సముద్రంలో కలిసే దారులు మూసుకుపోవడంతో కొల్లేటి లంక గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి.
కొల్లేరు లంకలో ఏకంగా 80 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 40కిపైగా ఇప్పుడు నీటితో మునిగాయి. స్ధానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. కొల్లేరుకు భారీ నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, ఇంకోవైపు రామిలేరు ఇలా అన్ని వాగుల నుంచి వచ్చిన వరద నీరు కొల్లేరులో వరదను పెంచేసింది. దీంతో ఆయా గ్రామాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది.
దీంతో కొల్లేరు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. ఏలూరు – కైకలూరు మెయిన్ రోడ్డును అధికారులు మూసివేశారు. చిన ఎడ్లగాడి దగ్గర వరద నీరు ప్రధాన వంతెనపై నుంచి పారుతోంది. దీంతో ఇక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కానీ, విజయవాడలోనే పరిస్థితి ఇంకా సర్దుమణగక ముందే.. కొల్లేరుకు ఇబ్బందులు రావడంతో చంద్రబాబు తీవ్ర టెన్షన్ పడుతున్నారు. ఇప్పటి వరకు కృష్ణాజిల్లా నుంచి అధికారులను విజయవాడకు తీసుకువచ్చారు.
ఇప్పుడు అక్కడ కూడా వరద పెరగడంతో ఇతర జిల్లాల నుంచి అధికారులను, సిబ్బందిని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దగ్గర ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోం ది. కొల్లేరు నుంచి ఉప్పుటేరులోకి వరద నీరు చేరుతోంది. ఫలితంగా ఆకివీడు, చినకాపవరం, దుంపగడప, సిద్దాపురం, చినిమిల్లిపాడు గ్రామాలు నీటమునిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు.