అమ్మ పెట్టదు.. అడుక్కుని తిననివ్వదు! అన్నచందంగా మారింది.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యవహారం. అమరావతిని చంద్రబాబు అనే తన ప్రత్యర్థి ప్రారంభించారు కాబట్టి.. ఇది ఎంత పెద్ద మహా నగరమైనా.. ప్రపంచ దేశాలు సైతం.. విస్తుపోయేలా దీనిని నిర్మిస్తున్నా.. ఆయన ఓర్వలేక పోతున్నారు. ఎక్కడో ఒక చోట పుల్లలు పెడుతూనే ఉన్నారు.. పనులు ముందుకు సాగకుండా చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఎదురీది అడ్డంకులు తొలగిస్తున్నా.. ఏవో ఒక అడ్డంకులు మళ్లీ మళ్లీ సృష్టిస్తూనే ఉన్నారు.
గతంలో 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిచేసేందుకు ప్రయత్నించి.. రాజధా నిని రుణాలు సేకరిస్తున్న సమయంలోనే ప్రపంచ బ్యాంకుకు అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నాయ కుడు.. ఆళ్లరామకృష్నారెడ్డి వరుస పెట్టి లేఖలు సంధించారు. మీరు అప్పులు ఇవ్వోద్దని, ఇక్కడి రైతులను బెదిరించి భూములు తీసుకున్నారని.. పైగాఅవి అసైన్డ్ భూములని.. ఇలా లేనిపోని వాదాలు సృష్టించి.. ప్రపంచ బ్యాంకు రుణాలను అడ్డుకున్నారు.
అప్పట్లో వైసీపీ అనుకున్నది సాధించింది. దీంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైంది. ఇక, తమ జమానా వచ్చాక.. పూర్తిగా ఈ రాజధానిని అటకెక్కించే క్రతువును నిర్విఘ్నంగా.. నిర్విరామంగా సాగించాలని చేసిన ప్రయత్నాలకు అదే రైతులు అడ్డు పడి.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా.. ఏళ్ల తరబడి పోరాడి.. న్యాయ వేదికలను ఆశ్రయించి.. నాలుగేళ్లపాటు.. కాపాడుకున్నారు. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చింది. మళ్లీ పనుల్లో వేగం పెరిగింది.. రాజధాని విస్తరణకు కూడా బాటలు పడుతున్నాయి.
ఇక, మూడు రాజధానుల పాట పాడిన జగన్కు ప్రజలు బుద్ధిచెప్పారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంత జరిగినా.. అంటే.. చింత చచ్చినా.. పులుపు చావదన్నట్టుగా.. జగన్కు ఆయన పరివారానికి.. అమరావతిపై కసి చావలేదు. ఇంకా ఇక్కడేదో అక్రమాలు జరుగుతున్నాయని.. టెండర్లలో అవినీతి జరుగుతోందని.. మీరు అప్పులు ఇస్తే.. మునిగిపోతారని.. ఇక్కడ వరద ప్రాంతాలు ఉన్నాయని.. ఇలా మళ్లీ లేనిపోని భ్రమలు కల్పిస్తూ.. లేఖలు సంధించారు.
అయితే.. అదృష్టవశాత్తు.. ఈ సారి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులు.. ముందుగానే కళ్లు తెరిచాయి. వీటిలో నిజాలు ఎంతో తెలుసుకుని.. తాజాగా ఆయా లేఖలను బుట్టదాఖలు చేస్తున్నట్టు ప్రకటించాయి. `మాకు లేఖలు వచ్చాయి. ఎవరు రాశారో చెప్పలేం కానీ.. వాటిని మేం విస్మరించాం. అమరావతికి నిధులు ఇస్తున్నాం.` అని ప్రపంచ బ్యాంకు ప్రకటనచేయడం గమనార్హం.