వివాదాలకు ఆనవాలుగా నిలిచే మాజీ మంత్రి కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు అలియాస్ నాని ఊళ్లో అనగా గుడివాడ నియోజకవర్గం లో అనగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో టిడ్కో ఇళ్లు పూర్తి అయ్యాయి. వీటి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు . చిత్రం ఏంటంటే… వీటిని గతంలో చంద్రబాబు హయాంలో పట్టాలిచ్చి నిర్మించిన ఇళ్లు. చాలా వరకూ పూర్తిచేశారు కానీ ఓ పది శాతం నుంచి ఇరవై శాతం పనులు అప్పుడు మిగిలి పోయాయి. వీటిపై అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.
ముఖ్యంగా టిడ్కో ఇళ్లకు చెల్లించాల్సిన వాయిదాలు ఎవ్వరూ చెల్లించాల్సిన పనే లేదని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి అప్పట్లో పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు జగన్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క లబ్ధిదారుడికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎప్పటిలాగే ఇందులోను మాట తిరగేసి… ప్రతిపక్షాల పోరాటం తర్వాత… చివర్లో మాత్రమే పనులు మిగిలిన కొన్నిటిని పూర్తి చేసి తమ ఖాతాలో వేసుకుంటున్నారు.
ఆ విధంగా జగన్ నేతృత్వంలో కొన్ని చోట్ల టిడ్కో ఇళ్లు పూర్తవ్వగా, ఆ రోజు విపక్ష నేత హోదాలో ఉంటూ మాట్లాడిన మాటలు ఫెయిల్ అయ్యాయి. గుడివాడలో ఇళ్లు కంప్లీట్ అయ్యాయేమో కానీ శ్రీకాకుళంలో మాత్రం అవి అలానే ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు ఆనవాలుగా నిలుస్తున్నాయి.
ఇక ఈ గ్రూప్ హౌస్ ప్లానింగ్ అన్నది ఎలా ఉంది ఎంతటి నాణ్యతతో ఉంది అన్నది కూడా తేలాల్సిందే! గత సర్కారు హుద్ హుద్ ఇళ్లను పూర్తి చేసి ఇస్తే జగన్ సర్కారు పంపకాలు పోగా కొన్ని తమ వాళ్లకు కేటాయించి బాగానే విమర్శలు పొందింది. ఆ విధంగా శ్రీకాకుళం జిల్లాలో కట్టిన హుద్ హుద్ ఇళ్లు గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు హయాం నుంచి వైసీపీ హయాంలోకి వచ్చాక లబ్ధిదారుల పేర్లే మారిపోయాయి.
అదేవిధంగా ఇక్కడ కూడా అంటే గుడివాడలో కూడా సిసలు లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరిగిందా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తేలిపోనుంది. ఏ మాటకు ఆ మాట 55 శాతం ఓటింగ్ ను దక్కించుకోనున్న ఉత్సాహంలో ఉన్న కొడాలి నాని ఏ విధంగా ఈ ఇళ్లను లబ్ధిదారులకు తన, పర భేదం లేకుండా కేటాయింపులు చేశారో అన్నది కూడా ఇప్పుడిక విపక్ష పార్టీలకు ఒక చర్చనీయాంశం. త్వరలో ముఖ్యమంత్రి బర్త్ డే (డిసెంబర్ 21) సందర్భంగా ఇవి ఓపెనింగ్ కు నోచుకోనున్నాయి.