టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్ మీద ఆదాయపు పన్ను అధికారుల దృష్టిపడ్డట్లు సమాచారం. ఆయన మీదే కాదు.. సుకుమార్‌తో వరుసగా సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద కూడా ఐటీ వాళ్లు కన్నేశారట. ప్రస్తుతం సుకుమార్ ఆఫీస్, ఇల్లు.. అలాగే మైత్రీ అధినేతలు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేనిలకు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు మైత్రీ వారికి సంబంధం ఉన్న ఫీనిక్స్ ఆఫీసుల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
మైత్రీ సంస్థ టాలీవుడ్లోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా అవతరించింది. ప్రస్తుతం ఆ సంస్థ చేస్తున్న, చేయబోయే సినిమాల సంఖ్య, రేంజ్ పరంగా చూస్తే టాలీవుడ్లో నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్‌గా చెప్పొచ్చు. వందల కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’తో పాటు పలు భారీ చిత్రాలను ఆ సంస్థ నిర్మిస్తోంది. మైత్రీ సంస్థకు సుకుమార్ ఆస్థాన దర్శకుడిగా మారిపోయారు. ఆయన సొంతంగా తెరకెక్కించే చిత్రాలతో పాటు తన శిష్యులు తీసే సినిమాలు కూడా చాలానే మైత్రీ బేనర్లో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలన్నింటికీ రైటింగ్ దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ సుకుమార్ భాగస్వామ్యం ఉంటోంది. ఆర్థిక లావాదేవీలు కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతుంటాయి. పారితోషకాలు కాకుండా అన్ని సినిమాలకూ ఆదాయంలో వాటా తీసుకుంటున్నారు సుక్కు.
ఈ క్రమంలో ఆయన గత కొన్నేళ్లలో భారీగానే ఆర్జించినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ ద్వారా పదుల కోట్లలో ఆదాయం అందుకున్న సుకుమార్ ఆ డబ్బులతో భూములు కొన్నారు. వేరే ఇన్వెస్ట్మెంట్లు చేశారు. ఇక మైత్రీ సంస్థలో రాజకీయ నాయకులు భారీగా పెట్టుబడులు పెట్టారని.. కాబట్టే సినిమాల మీద వందల కోట్ల బడ్జెట్లు పెట్టగలుగుతున్నారని ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఒక చర్చ నడుస్తోంది. ‘పుష్ప’ సహా కొన్ని సినిమాలకు మైత్రీ వాళ్లు ప్రకటించిన భారీ కలెక్షన్ల ఫిగర్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఐటీ వారి కళ్లు పడటానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.