ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చే పేర్లలో ఆర్కే రోజా ఒకరు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోరమైన పరజయాన్ని మూటగట్టుకున్నారు. సొంత పార్టీలోనే వ్యతిరేక కుంపటి ఆమె ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఫ్యాన్ కి పవర్ కట్ అవ్వడంతో కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. అప్పటి నుంచి రోజా సైలెంట్ అయిపోయారు.
వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండటంతో ఒకానొక సమయంలో రోజా ఏపీ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. వీటన్నిటికీ చెక్ పెట్టిన రోజా ఇటీవల మళ్ళీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే రోజా దూకుడు వెనుక రీజన్ వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారం పేరుతో గత ఐదేళ్లు అడ్డగోలు దోపిడీకి తెగబడ్డ వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా చిక్కుల్లో పడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర, టీటీడీ టికెట్ల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తుంది. టీటీడీ టికెట్లు పేరిట కోట్లాది రూపాయలు నొక్కేసినట్లు రోజాపై బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో రేపో మాపో ఆమెకు నోటీసులు రావడం ఖాయం. ఇలాంటి తరుణంలో రోజా దూకుడుగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్ చార్జీలు పెంచారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
శుక్రవారం నగరి వైసీపీ పోరుబాటు కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించిన రోజా.. నగరి కూడలిలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చేరిగారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు షూరిటీ లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కేసులు పెడతారా పెట్టుకోండి.. జైల్లో పెడతారా పెట్టుకోండి అంటూ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా రోజా ఛాలెంజ్ కూడా చేశారు. రెచ్చగొట్టి అరెస్ట్ చేయించుకుంటే.. సింపతీ పెరుగుతుంది, తద్వారా ప్రజలకు మరింత దగ్గరవచ్చు. ఈ ఫార్ములాను ఇప్పటికే చాలా మంది ఉపయోగించి సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు రోజా సైతం ఇదే ఫాలో అవుతుందని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది.