కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మైండ్ గేమ్ షురూ చేశారు. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబును ఉద్ధేశిస్తూ.. యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు 75 ఏళ్ల వృద్ధుడైన పెద్దమనిషి నాయకత్వం వహించలేడని విమర్శించారు. జాతీయ ప్రజాదరణ మరియు వయస్సు రిత్యా పవన్ కళ్యాణ్ గారికే ఏపీకి ప్రాతినిధ్యం వహించే సత్తా ఉందని విజయసాయి రెడ్డి పుల్లలు పెట్టే ప్రయత్నం చేశారు.
అక్కడితో ఆగలేదు.. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే టైమ్ కి చంద్రబాబు బతికి ఉంటే జైలుకు వెళ్లడం తథ్యమంటూ బెదిరింపులకు దిగారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పట్ల తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం విజయవాడలోని సబ్‌జైల్ లోని పరిస్థితులు, మౌలిక వసతులను పరిశీలించిన అనిత.. అనంతరం మీడియా మాట్లాడారు.
తన తప్పులు బయటపడుతున్నాయనే కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టే విధంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారని.. స్థాయి మరిచి నోటికొచ్చినట్లు చిల్లరగా కామెంట్స్ చేస్తున్నారని అనిత ఫైర్ అయ్యారు. ఎన్ని రకాలుగా చంద్రబాబును తిట్టినా.. పవన్ కల్యాణ్‌కు, తమకు మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించినా.. విజయసాయి రెడ్డిని మాత్రం వదిలిపెట్టేదిలేదని అనిత వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, జగన్ అండ్ బ్యాచ్ రాష్ట్ర సంపదను అడ్డగోలుగా దోచుకున్నారని హోం మంత్రి అనిత విమర్శించారు. కాకినాడ పోర్ట్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని.. రేషన్ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అనిత పేర్కొన్నారు.