ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు వైకాపాకు రాజీనామా చేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇటీవలె మాజీ మంత్రి, వైసీపీ నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. బాలినేని బాటలోనే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు సామినేని ఉదయభాను కూడా నడుస్తున్నారు.
అయితే నేతల వరుస రాజీనామాలతో ఇక్కట్లు పడుతున్న జగన్ కు అతి త్వరలోనే ఇంకొక షాక్ తగలబోతోంది. వైకాపా నుంచి మరో బిగ్ వికెట్ ఔట్ అవ్వబోతోందని బలంగా టాక్ నడుస్తోంది. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ ముఖ్యనేతలతో శ్రీనివాస్ మంతనాలు జరుపుతున్నారు. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. శ్రీనివాస్ వైసీపీని వీడటం ఖాయమవుతుందని అంటున్నారు.
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున భీమవరం నుండి శ్రీనివాస్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరగా.. ఆయనకు టికెట్ దక్కలేదు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్.. టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు పులపర్తి(అంజిబాబు) చేతిలో ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో మళ్లీ భీమవరం స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయం సాధించారు. అయితే పవన్ కళ్యాణ్ పై గెలిచిన కూడా వైసీపీ అధిష్టానం శ్రీనివాస్ కు సరైన పదవి ఇవ్వలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న శ్రీనివాస్.. ఇటీవల ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్ లతో జగన్ సమావేశం అవ్వగా.. శ్రీనివాస్ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.