చూస్తుండగానే వేలల్లో కేసుల నమోదు లక్ష దాటటమే కాదు.. ఇప్పుడు రెండు లక్షల కేసుల్ని దాటేశాయి. చూస్తునే ఉండండి.. రానున్న రెండు వారాల్లో నాలుగైదు లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు. దీనికి కారణం.. పాలకుల వైఫల్యమే. ఏడాది క్రితం కరోనా.. దాని విపరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కాని వేళలో.. వ్యవహరించిన తీరుకు.. కరోనా కారణంగా ఎంతటి నష్టం వాటిల్లుతుందన్న విషయం తెలిసిన వేళలోనూ కేసుల నమోదు ఇంత భారీగా నమోదు కావటం వెనుక అసలు కారణం ఏమిటి? జరుగుతున్న తప్పేంటి? పాలకుల తప్పులకు సామాన్యులు బలి అవుతున్నారా? లేక.. వారే చేజేతులారా తప్పులు చేస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది.
క్యాలెండర్ లో రోజు గడిచేసరికి.. భారతావనిని కరోనా కబళించేస్తోంది. రోజు వ్యవధిలో రెండు లక్షల కేసుల నుంచి 2.16లక్షల కేసుల పెరుగుదల చూస్తే.. రానున్న పది రోజుల్లో పెరిగే కేసుల లెక్కకు మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇప్పటికే నిండిపోయిన ఆసుపత్రులు.. బెడ్ల కోసం రిక్వెస్టులు.. రెమిడెసివర్ లాంటి వాటి కోసం పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. దేనికైనా సరే.. కొరత.. కొరత అన్న మాట తప్పించి.. సేవలు అందిస్తామని చెప్పలేని పరిస్థితి.
దేశంలోని మిగిలిన రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతలతో పోలిస్తే.. మూడు రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు భారీగా ఉంటున్నాయి. రికార్డు స్థాయిలో మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ రాష్ట్రాల్లో రోజుకు లక్షకు పైగా కేసులునమోదు అవుతున్న పరిస్థితి చూస్తే.. ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత సాధారణ స్థాయిని దాటిపోయి.. ప్రమాదకర పరిస్థితికి చేరుకుందని చెప్పాలి. ఇంత భారీగా కేసులు నమోదు అవుతున్నా.. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగా కనిపిస్తాయి.దీనికి రాజకీయ కోణం కూడా కారణంగా చెప్పక తప్పదు. ఢిల్లీ.. మహరాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉండటం.. అక్కడ తగిన విధంగా కేంద్రం ఫోకస్ పెట్టలేదన్న విమర్శ వినిపిస్తోంది.
దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరి ఉంది.అయినప్పటికి అక్కడ కూడా కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువగానే ఉన్నాయి. వాటిని అరికట్టటం కోసం చర్యలు తీసుకుంటున్నా.. అవేమీ సరిపోని పరిస్థితి. ఇలాంటివేళ.. కఠిన చర్యల్నియుద్ధ ప్రాతిపదికన చేపట్టకుంటే అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికి జరిగిన దానికైనా సరే.. కళ్లు తెరిస్తే మంచిది. లేకుంటే.. అంతకు మించిన విషాదం ఏముంటుంది?పాలకుల తప్పులు ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తోందన్నది మర్చిపోకూడదు.