ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ నేత, మంత్రి రఘువీరారెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన రఘువీరా రెడ్డి….రాష్ట్ర విభజనానంతరం సైలెంట్ కావాల్సి వచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అవసాన దశకు చేరుకున్న తరుణంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రఘువీరా కూడా పార్టీకి పున: వైభవం తేలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రఘువీరా స్థానంలో సాకే శైలజానాథ్ కు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పీసీసీ పగ్గాలు అప్పజెప్పింది. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన రఘువీరా…1200 ఏళ్ల చరిత్ర ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను భుజానికెత్తుకొని బిజీ అయిపోయారు.
తాజాగా ఆ గుడినిర్మాణం పూర్తి కావడం, అదే సమయంలో ఏపీ కాంగ్రెస్ ను గాడిన పెట్టాలని సోనియా, రాహుల్ గాంధీలు భావించడం వంటి అంశాల నేపథ్యంలో రఘువీరా పొలిటికల్ రీ ఎంట్రీపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రఘువీరా రాజకీయ అజ్ఞాతం వీడబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ కు రఘువీరా షాకివ్వబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రఘువీరాకు టీడీపీ నుంచి ఆహ్వానం అందిందని, త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కబోతున్నారని జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి…రఘువీరాను కలవడం ఈ పుకార్లకు ఊతమిస్తోంది.
నీలకంఠాపురంలో రఘువీరారెడ్డితో భేటీ అయిన ప్రభాకర్ రెడ్డి…ఆయనను టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సీమ హక్కుల కోసం కలిసి పోరాడేందుకు ముందుకు రావాలని, టీడీపీలో చేరాలని జేసీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పట్టువదలని విక్రమార్కుడిలా రఘువీరా గుడి నిర్మాణ పనులు చూసుకున్న వైనంపై కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారట. దీంతో, రఘువీరారెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రఘువీరా రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడానికే ప్రభాకర్ రెడ్డి వెళ్లారనే చర్చ అనంతపురంతో పాటు ఏపీలో జోరుగా సాగుతోంది. చంద్రబాబుతో రఘువీరా విషయంపై జేసీ ప్రభాకర్ రెడ్డి చర్చించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, రఘువీరా పార్టీ మారతారా లేదంటే కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక..ఆధ్యాత్మిక జీవితాన్ని కంటిన్యూ చేస్తారా అన్నది తేలాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు.