అవును జగన్మోహన్ రెడ్డికి ఇంగ్లీషు మీడియం పిచ్చి బాగా పట్టుకున్నట్లుంది. ప్రాధమిక విద్య నుండి డిగ్రీ వరకు మొత్తం విద్యా వ్యవస్ధ నుండి తెలుగును మాయం చేసేసి సర్వం ఇంగ్లీషుమయం చేసేయాలని కంకణం కట్టుకున్నట్లే ఉంది చూస్తుంటే. ఇంగ్లీషు మీడియా పిచ్చి కారణంగా విద్యార్ధుల చాయిస్ గురించి కూడా జగన్ ఆలోచించటంలేదు.
తాము ఏ మీడియంలో చదవాలనే చాయిస్ ను కళాశాల యాజమాన్యాలు విద్యార్ధులకే వదిలేయాలన్నది ప్రాధమిక సూత్రం. అలాకాకుండా కేవలం ఇంగ్లీషు మీడియంలోనే చదవాలనే నిర్బంధం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
దేశంలోని ఏ రాష్ట్రంలో చూసిన మీడియం ఆప్షన్ విద్యార్ధులకే వదిలేస్తున్నాయి. అలాంటిది ఏపిలో మాత్రం విద్యార్ధులకు ఆప్షన్ లేకుండా చేయటం జగన్ కు ఎంతమాత్రం తగదు.
2021-22 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని తెలుగు మీడియంలను మూసేసి కేవలం ఇంగ్లీషు మీడియంను మాత్రమే కంటిన్యు చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం ఒకవిధంగా విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేయటమే.
ఇంటర్మీడియట్ ను తెలుగు మీడియంలో చదివిన విద్యార్ధులు ఒక్కసారిగా ఇంగ్లీషు మీడియంలో చదవాలంటే ఎంత ఇబ్బంది పడతారో ప్రభుత్వానికి అర్ధమైనట్లు లేదు. చిన్నప్పటి నుండి ఇంగ్లీషు మీడియంలో చదివిన విద్యార్ధులకు ఇబ్బందులు లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియంలోనే చదివిన విద్యార్ధులు వేలల్లో ఉన్నారు.
పోయిన ఏడాది డిగ్రీ కాలేజీలకు జరిగిన అడ్మిషన్లలో 2.6 లక్షల మంది చేరారు. వీరిలో సుమారు 66 వేల మంది తెలుగు మీడియంలో చేరారు. ఇపుడు హఠాత్తుగా డిగ్రీలో చదువంతా ఇకనుండి ఇంగ్లీషు మీడియంలోనే అంటే తెలుగు మీడియంలో చేరిన విద్యార్ధుల భవిష్యత్తు ఏమైపోవాలి ?
కాబట్టి ఇప్పటికైనా ఏ మీడియంలో చదవాలనే ఆప్షన్ను ప్రభుత్వం విద్యార్ధులకే వదిలేయటం చాలా ఉత్తమం. లేకపోతే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకెళితే మళ్ళీ అక్షింతలు తప్పవు.