టాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఎవరైనా తనను గొడవలు, వివాదాల్లోకి లాగాలని చూసినా ఆయన సంయమనం పాటిస్తారు. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన స్థలం విషయంలో జగన్ సర్కారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినపుడు కూడా ఇదే సంయమనం చూపించారు. మీడియా ముందు ఏమీ మాట్లాడకుండా లీగల్‌గా ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు.
ఈ వివాదంలో సురేష్ తనయుడు రానా పేరు కూడా చేరడం గమనార్హం. ఫిలిం నగర్లో ఓ భూ వివాదానికి సంబంధించి రానా, సురేష్‌లపై క్రిమినల్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రమోద్ అనే వ్యాపారి కోర్టులో పోరాడి వారిపై కేసు నమోదయ్యేలా చేశారు.
ఈ కేసు గురించి ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ సురేష్ బాబుపై ఆరోపణలు చేశారు. ఫిలిం నగర్‌లోని రెండో నంబర్ ఫ్లాటును ముందుగా తనకు 2014 నుంచి 2018 వరకు లీజుకు సురేష్ బాబు ఇచ్చారని.. తర్వాత రూ.18 కోట్లకు ఆ ఫ్లాట్‌ను తాను కొన్నానని.. ఇందుకోసం సురేష్‌కు రూ.5 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చానని ప్రమోద్ వెల్లడించారు.
ఐతే పూర్తి డబ్బులు చెల్లించడానికి తాను సిద్ధమై రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా.. అందుకు సురేష్ బాబు అంగీకరించలేదన్నారు. పైగా ఆ స్థలం నుంచి తనను దౌర్జన్యంగా ఖాళీ చేయించారని.. రౌడీలతో బెదిరించారని ప్రమోద్ ఆరోపించారు. తనకు రూ.18 కోట్లకు ఫ్లాట్ ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుని.. ఆ తర్వాత సురేష్ బాబు తన కొడుకు రానాకు రూ.9 కోట్లకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించారని.. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని చెప్పారు. తాను సురేష్, రానాల మీద ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదని.. దీంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు ప్రమోద్ వెల్లడించారు.