ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే ఒక అదిరిపోయే స్వీట్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా కాంటిన్లు పునఃప్రారంభం, ఉచిత ఇసుక వంటి హామీలను కొత్త ప్రభుత్వం అమలు చేసింది.
ఇక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిరుద్యోగులకు ప్రతి నెల భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు ఒక్కొక్కరికి రూ. 3 వేలు అందిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించేందుకు యువ నేస్తం పథకాన్ని మరో రెండు మూడు నెలల్లోగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది నిరోద్యోగులు ఉన్నారు..? వారి అర్హత ఏంటి..? ఒక్కొక్కరికి నెలకు రూ. 3 వేలు ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ అవసరమవుతుంది..? వంటి అంశాలపై ప్రభుత్వ అధికారులు కస్తరత్తలు చేస్తున్నారు. అతి త్వరలోనే యువ నేస్తం పథకం అమలుపై సర్కార్ నుంచి తీపి కబురు వస్తుందని అంటున్నారు. కాగా, ఈ పథకంలో నిరుద్యోగ భృతి పొందాలంటే ఏపీ పౌరుడై ఉండాలి. అభ్యర్థ వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
కనీసం ఇంటర్ మీడియట్ లేదా డిప్లొమా లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హతగా ఉండాలి. అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కంటే మించి ఉండకూడదు. అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు రూ. 10 వేలు కన్నా తక్కువ ఆదాయం ఉండాలి. అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారై ఉండకూడదు.