మాజీ సీఎం జగన్ తన హయాంలో ఢిల్లీ పర్యటనకు వెళితే తన కేసుల గురించి మాత్రమే మాట్లాడుకుంటారని, రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలు పట్టించుకోలేదని విమర్శలున్నాయి. కట్ చేస్తే ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు పలు మార్లు ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ టూర్ లో కేవలం రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించే కేంద్రంలోని పెద్దలతో చంద్రబాబు ముచ్చటిస్తున్నారు. ఆ కోవలోనే మునుపెన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్ర బడ్జెట్ లో భారీ స్థాయిలో నిధులు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
మోదీతో చంద్రబాబు భేటీ దాదాపు గంట సేపు సాగింది. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని మోదీని చంద్రబాబు కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదలతోపాటు పలు అంశాలపై వారు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మిగతా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మోదీకి బాబు విజ్ఞప్తి చేశారు.
మోదీతో భేటీ ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై చర్చించారు. సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ లోక్ సభా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.