రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు ప్రసంగిస్తూ.. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్వహణ సరిగ్గా లేక.. తిరుమల శ్రీవారి గోశాలలో గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు మృతి చెందాయంటూ ఇటీవల టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ విషయంలో అధికార కూటమి పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు కూడా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఏపీలో హీటు పుట్టిస్తున్న టీటీడీ గోశాల ఇష్యూపై చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. `తిరుమల శ్రీవారి గోశాలలో గోవులు చనిపోయాయంట… ఆయన(భూమన కరుణాకర్ రెడ్డి) బాధపడుతున్నాడంట.. దేవుళ్లపై దాడులు చేసిన మీకు (వైసీపీ నేతలు) నేడు వెంకటేశ్వరస్వామిపై ఇంత భక్తి వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈనాడు తిరుమల క్షేత్రం సంప్రదాయాలు పాటించలేదు. అలాంటి మీరు… ఇవాళేదో జరగరానిది జరిగిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి కపట నాటకాలు ఇకనైనా కట్టిపెట్టండి` అంటూ వైసీపీ నేతలకు చంద్రబాబు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే వివేకా హత్యపై చంద్రబాబు పరోక్షంగా కామెంట్లు చేశారు. గతంలో నేనొకసారి గొడ్డలి పోటును గుండెపోటుగా నమ్మి మోసపోయాను. ఈ రోజు నేను గనుక కరెక్ట్ గా అనలైజ్ చేసి విషయం అర్థం చేసుకుని దోషులను అరెస్ట్ చేసుంటే ఏమై ఉండేదో ఆలోచించుకోండి. ఆ ఒక్క చిన్న తప్పుకు రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకుంది. అందుకే అవతలి వారు చేసే కుట్రలను ప్రజాచైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లేదంటే మళ్లీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.