తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించిన సంగతి తెలిసిందే. వలంటీర్లను అడ్డుపెట్టుకొని ఓటర్లను ప్రలోభపెట్టడం మొదలు…వైసీపీకి ఓటేయకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామంటూ వైసీపీ నేతలు వార్నింగులు ఇవ్వడం వరకూ ఎన్నో ఘట్టాలు ముగిశాయి. అయినప్పటికీ, తృప్తి చెందని వైసీపీ నేతలు పోలింగ్ నాడు సరికొత్త అక్రమాలకు తెరతీశారు.
ఓటమి భయం పట్టుకున్న వైసీపీ నేతలు …తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు లారీలకు లారీలు జనాలను దించారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దొంగ ఓట్లు వేసేందుకు బస్సుల్లో, లారీల్లో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలను తీసుకువచ్చారని కేంద్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకు చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
కడప జిల్లా రిజిస్ట్రేషన్లు ఉన్న బస్సులు..కార్లు ఎక్కువగా తిరుపతి రావటం.. అందులో నకిలీ ఓటు స్లిప్పులు ఉన్న వారిని టీడీపీ వర్గాలు పట్టుకున్నాయని తెలిపారు. దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ నేతలు జిల్లాల నుంచి వాహనాల్లో తరలిస్తున్న వైనంపై కంప్లైంట్ చేశారు. ఎన్నికల పరిణామాలపై ఫిర్యాదు చేసిన చంద్రబాబు… దొంగ ఓట్లపై వెంటనే చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
మరోవైపు, తిరుపతిలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ.. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆఫీసు ముందు టీడీపీ నేతలు.. కార్యకర్తలు ధర్నాకు దిగారు. పీఎల్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాలు వద్దకు చౌడేపల్లి నుంచి వచ్చిన కొందరిని టీడీపీ నేతలు పట్టుకొని మీడియాకు చూపించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ కార్యకర్తలు.. ఆ టైంలో అటువైపు వెళుతున్న ఒక బస్సును ఆపారు. అందులో నకిలీ ఓటు స్లిప్పులు ఉన్న వారిని గుర్తించి.. పోలీసులకు అప్పగించిన వైనం సంచలనంగా మారింది.
టీడీపీ నేతలతో పాటు.. కాంగ్రెస్ నేత చింతా మోహన్ సైతం వైసీపీకి చెందిన దొంగ ఓటర్లు భారీగా తిరుపతికి వచ్చారని ఆరోపించారు. పీఎల్ఆర్ కల్యాణ మండపాన్ని అధికారులు వెంటనే తనిఖీ చేయాలని.. బయట నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిణామాలతో తిరుపతి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
.
ఇంత ఓపెన్ గా ఇతర జిల్లాల నుంచి తిరుపతికి వస్తున్న వారి విషయంలో అధికారులు ఏం చేస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. ఒక బహిరంగ సభ జరిగినప్పుడు ఏ రీతిలో అయితే ఇతర జిల్లాల నుంచి భారీగా వస్తారో.. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతి పట్టణానికి ఇదే రీతిలో బస్సుల్లో.. కార్లలో రావటాన్ని ప్రశ్నిస్తున్నారు.