ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు, మంత్రులకు టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బుచ్చి రాం ప్రసాద్.. గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు.. సవాళ్లు రువ్వారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చదువు విషయంలో విమర్శలు చేస్తున్న మంత్రులు.. ఆయన వాక్చాతుర్యంపై కామెంట్లు చేస్తున్న నాయకులు.. ఒక్క గంట.. ఆయనతో చర్చించేందుకు రెడీనా ? అంటూ.. సవాల్ విసిరారు. ఎక్కడైనా.. ఏ ఛానలైనా.. సరే.. ఏ విషయంపైనైనా సరే చర్చించేందుకు లోకేష్ సిద్ధమేనని అన్నా రు.
ఇటీవల కొందరు మంత్రులు.. లోకేష్ చదువు గురించి మాట్లాడుతూ.. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి లోకేష్‌కు సర్టిఫికెట్ ఇవ్వడంపై సదరు యూనివర్సిటీకి లేఖ రాస్తామని కామెంట్ చేశారు. దీంతో వీరి వ్యాఖ్యలపై తాజాగా బుచ్చి రాం ప్రసాద్ స్పందించారు. వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేయడం.. విమర్శించడం సరికాదన్న ఆయన.. సీఎం జగన్ కుమార్తె కూడా అమెరికాలోనూ… ప్రస్తుతం బ్రిటన్‌లోనూ చదువుతున్నారని.. కొందరు ఆమె గురించి.. విదేశీ విద్యాసంస్థల్లో సీటు కొనుక్కున్నారని కామెంట్లు చేశారని.. అయితే..తాను వాటిని ఖండించానని బుచ్చి తెలిపా రు.
విదేశీ విద్యాసంస్థల్లో సీటు రావాలంటే ఎంతో కష్టపడాలని.. జీఆర్ ఏ, టోఫెల్ వంటి అనేక పరీక్షలు రాయాలని చెప్పాలని. ప్రత్యర్థిపార్టీనే అయినప్పటికీ.. వ్యక్తిగత విషయాల్లో లేనిపోని విమర్శలను చేయడం సరికాదని తాను హితవు పలికానని.. టీడీపీ స్టాండ్ ఇదేనని అన్నారు.
అయితే.. పదో తరగతి కూడా చదవని వైసీపీ మంత్రులు కొందరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న లోకేష్‌పై అవా కులు చెవాకులు పేలడాన్ని తాను సహించలేక పోతున్నానని అన్నారు. అండర్ గ్రాడ్యుయేట్‌ను అమెరికాలో చేసిన లోకేష్.. తర్వాత స్టాన్ ఫర్డ్‌లో చదువుకున్నారని.. ఇది ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ అని వివరించారు. “మీరు(మంత్రులు) లేఖలు రాయాలని అనుకుంటే.. ముందుగా జగన్ ఎక్కడ చదువుకున్నానని చెబుతున్నాడో.. ఆ వర్సిటీకి లేఖలు రాయాలని.. అదేవిధంగా మీరు చదువుకున్న సంస్థలకు కూడా లేఖలు రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని దుయ్యబట్టారు.
“కొన్నాళ్ల కిందట చంద్రబాబుతో కలిసి నేను బ్యాంకాక్ వెళ్లాను . ఆ సమయంలో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో లోకేష్‌తో కలిసి చదువుకున్న ఒకాయన వచ్చి.. తనను తాను పరిచయం చేసుకుని.. చంద్రబాబుతో మాట్లాడారు. యూనివర్సిటీలో లోకేష్‌కు మంచి పేరుందని.. చెప్పారు. దీంతో చంద్రబాబు చాలా సంతోషించారు. ఆయన కళ్లలో పుత్రోత్సాహం కనిపించింది. మీలో (మంత్రులు) ఎవరైనా.. అలా తండ్రులకు పుత్రోత్సాహం కల్పించారా?“ అని బుచ్చి ప్రశ్నించారు. మీకు స్నేహితుల గురించి చెప్పాలంటే.. గ్లాస్ మేట్స్… టేబుల్ మేట్స్ తప్ప ఎవరూ ఉండరని.. మీతో పేకాట ఆడుకున్నవారే కనిపిస్తారని.. మంత్రులను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
అంతేకాదు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే అర్హత ఉన్న మంత్రులు ఎవరైనా.. ఉంటే.. రావాలని.. తానే స్వయంగా వారిని అక్కడ చేర్చి ఎన్నారైల నుంచి విరాళాలు సేకరించి ఫీజులు కడతానని సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం లేని మంత్రులు లోకేష్‌పై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. లోకేష్‌ను పప్పు అని విమర్శిస్తున్నారని.. కానీ.. దేశంలో అత్యంత పౌష్టికాహారం పప్పేనని.. నిత్యం కొన్ని కోట్ల మంది ప్రజలు పప్పును ఆహారంగా తీసుకుంటున్న విషయాన్ని మంత్రులు గుర్తించాలని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ మంత్రులు ఎప్పుడూ పప్పు తినలేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు విమర్శలు.. అర్ధంలేని మాటలు మానుకోవాలని బుచ్చి రాం ప్రసాద్ వైసీపీ మంత్రులకు ఘాటు హెచ్చరికలు చేశారు.