సాదాసీదా కార్యకర్త స్థాయి నుంచి పెద్దల సభకు ఎంపికైన వైనం ఇప్పుడు తెలంగాణ బీజేపీకి కొత్త జోష్ ను ఇచ్చేలా మారింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత..గతంలో పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించటంతో పాటు.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కె.లక్ష్మణ్ సేవల్ని బీజేపీ అధినాయకత్వం గుర్తించింది.
ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. సీనియర్లకు సముచిత గౌరవం కల్పించటంతో పాటు.. కష్టపడి పని చేసిన వారికి పదవులు దక్కుతాయన్న సంకేతాల్ని ఇచ్చినట్లైంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన్ను.. యూపీ నుంచి ఎంపిక చేశారు. దీంతో.. ఆయన లక్నోకు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మున్నూరు కాపు వర్గానికి చెందిన లక్ష్మణ్ 1956లో జన్మనించారు. అసలుసిసలు హైదరాబాదీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన తెలంగాణ తొలితరం బీజేపీ నేతల్లో ఒకరుగా చెప్పాలి. ఓయూలో చదువుకునే వేళలో ఏబీవీపీలో పని చేసిన ఆయన 1980లో బీజేపీలో చేరారు. 1995-99లో బీజేపీ హైదరాబాద్ నగర శాఖకు అధ్యక్షుడిగా పని చేశారు. తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 2016-2020 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు భార్య.. ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు.
1994లో తొలిసారి ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం 1999లో ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆయన 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2018లోజరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓడిన ఆయన్ను 2020 సెప్టెంబరులో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి బీజేపీ కోటాలో పెద్దల సభకు వెళుతున్న తొలి బీజేపీ నేత లక్ష్మణ్ కావటం గమనార్హం. తాజా ఎంపికతో పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు లభించటంతో పాటు.. పదవులు లభిస్తాయన్న విషయం స్పష్టమైంది. ఈ మధ్యన ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేయటం .. యోగి విజయానికి గట్టిగా పని చేసినట్లు చెబుతారు.