బే ఏరియా తెలుగు అసోసియేషన్ ( బాటా ) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల 11వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవము) ఘనంగా ముగిశాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు కలిసి మొత్తం 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ సంబరాలు ఆకట్టుకున్నాయి. 6 గంటలపాటు జరిగిన ఈ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా పాటలు, పద్యాలు, స్కిట్లు, వక్తల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఆడిటోరియాన్ని రంగురంగుల బ్యానర్లు, పూలు, ఇతర కళాకృతులతో అందంగా అలంకరించడం తో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు, కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు అందరూ అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కుమన్నారు.
విజయ ఆసూరి (సలహాదారు), వెంకట్ కోగంటి (తానా జాయింట్ సెక్రటరీ), వెంకట్ అడుసుమిల్లి (తానా ఆర్ ఆర్, నార్త్ కాలిఫోర్నియా), ప్రసాద్ మంగిన (సలహాదారు), డాక్టర్ రమేష్ కొండా, వీరు ఉప్పల,డా.గీతా మాధవి & సుబ్బారావు చెన్నూరి లు పాఠాశాల వార్షిక దినోత్సవానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా & బాటా ఎగ్జిక్యూటివ్ టీమ్లకు బృందం కృతజ్ఞతలు తెలిపి, ఉపాధ్యాయులు మరియు కోఆర్డినేటర్ల ప్రయత్నాలను ప్రశంసించారు. ప్రతి ఏటా బే ఏరియాలో పాఠశాలకు ఆదరణ పెరుగుతోందని, బే ఏరియాలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నారైల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాలు ద్వారా భవిష్యత్ తరాలకు తెలుగు భాష, సంస్కృతిని నేర్పడమే పాఠశాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వారు చెప్పారు.
‘సొగసరి అత్త గడసరి కోడలు’ స్కిట్, ‘ఎందరో మహానుభావులు’ (నాటిక), ‘అంబ పలుకు..జగదాంబ పలుకు’ (అవధానం), ‘మంత్రి ఎంపిక’, ‘మోహిని భస్మాసుర’, శ్లోకాలు, పద్యాలు, గేయాలను విద్యార్థులు ప్రదర్శించి ఆహూతులను అలరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రశ్నలు, సందేహాలను పాఠశాల కో ఆర్డినేటర్లు నివృత్తి చేశారు. పాఠశాల రిజిస్ట్రేషన్ బూత్ మరియు ఈ లెర్నింగ్ మీద స్పెషల్ డెమో కూడా ఏర్పాటు చేశారు. చాలామంది విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపారు.
ఈ కార్యక్రమం మొత్తానికి ‘గ్రాడ్యుయేషన్ వాక్’ హైలెట్ గా నిలిచింది. ప్రతి సెంటర్ నుంచి విద్యార్థులు, టీచర్లు వేదికపైకి వచ్చి వారి సర్టిఫికెట్లు అందుకున్నారు. గ్రాడ్యుయేషన్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతుండగా వారు సర్టిఫికెట్లు అందుకున్న దృశ్యాన్ని చూసి అతిథులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషా వికాస పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
శాంతా క్లారా బోర్డు అఫ్ ఎడ్యుకేషన్ ‘తారా కృష్ణన్’ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల నిర్వాహకులను అభినందించారు.
పాఠశాల చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చి సహకరించిన బాటా బృందాన్ని పరిచయం చేసి వారిని బాటా అధ్యక్షుడు కొండల్ రావు అభినందించారు. శివ కాడా (వైస్ ప్రెసిడెంట్), వరుణ్ ముక్క (సెక్రటరీ), హరి సన్నిధి(జాయింట్ సెక్రటరీ)లతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి తో కూడిన “స్టీరింగ్ కమిటీ”ని, కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన ‘సాంస్కృతిక కమిటీ’ని, సురేష్ శివపురం, రవి పోచిరాజు, సందీప్ కేదారిశెట్టిలతో కూడిన నామినేషన్ కమిటీని, సంకేత్, ఉదయ్, ఆదిత్య, గౌతమి, సందీప్, లతో కూడిన యూత్ కమిటీని పరిచయం చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందానికి, వినోదభరితమైన సాయంత్రాన్ని అందించిన బృందానికి BATA “సలహా బోర్డు” సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి శుభాకాంక్షలు తెలిపారు. తానా టీం మెంబర్ శ్రీనివాస్ వల్లూరిపల్లి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బే ఏరియా పాఠశాల కో ఆర్డినేటర్లు: శ్రీదేవి ఎర్నేని, సురేష్ శివపురం, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పలి, సునీత రాయపనేని, రవి పోచిరాజు
టీచర్లు: పద్మ సొంఠి, విజయ గోపరాజు, శ్రీవిద్య యలమంచిలి, షీలా గోగినేని, శ్రీకాంత్ దాశరధి, పద్మ విశ్వనాథ్, ధనలక్ష్మి, శరత్ పోలవరపు, దీప్తి మండలి, దీపికా బీహెచ్ఎస్, రాగిని అరసాడ, ధన కనగాల, శ్యామ్ బాలె, శ్రీనివాస్ కొల్లి
ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ పసందైన విందు భోజనాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.