ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తరచూ సంచలనంగా మారుతున్నాయి. తాజాగా రావి మస్తాన్ సాయి ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. ఇతగాడి కారణంగా తనకు ప్రాణహాని ఉందంటూ లావణ్య చేసిన ఫిర్యాదుతో మస్తాన్ రావును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఒక హార్డ్ డిస్కును సైతం పోలీసులకు అందజేశారు.
అందులో పదుల సంఖ్యలో యువతుల నగ్న వీడియోలు.. ఫోటోలు ఉన్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఈ ఇద్దరి మీదా గతంలో డ్రగ్స్ కేసులు నమోదై ఉన్నాయి. మస్తాన్ తో పాటు యూట్యూబర్ ఖాజాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకూ ఫిర్యాదు చేసిన 32 ఏళ్ల మన్నేపల్లి లావణ్య ఎవరు? అన్న సందేహం వచ్చిందా? కొద్దిరోజుల క్రితం సినీ నటుడు రాజ్ తరుణ్ ను తనను పెళ్లి పేరిట మోసగించాడని నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం.. ఆ ఉదంతంలో మస్తాన్ సాయి పేరు బయటకు వచ్చింది.
విజయవాడకు చెందిన ఆమె తర్వాతి కాలంలో హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు. మస్తాన్ సాయి తనకు ఉనీత్ రెడ్డి అనే స్నేహితుడి ద్వారా పరిచయమైనట్లుగా లావణ్య పేర్కొన్నారు.
2022లో పరిచయమైన ఇతడు.. మహిళలు.. వివాహితల్ని లక్ష్యంగా చేసుకొని వారి ఫోన్లను హ్యాక్ చేస్తాడని.. గూగుల్.. ఐక్లౌడ్ లోని వారి వ్యక్తిగత ఫోటోల్ని సేకరించి బెదిరింపులకు దిగి.. వారిని లోబర్చుకుంటాడని పేర్కొన్నారు.
బాధితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకుంటాడని.. ఈ సందర్భంగా వీడియోలు షూట్ చేసి వాటిని చూపించి బెదిరింపులకు దిగుతాడని ఆమె పేర్కొన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్ ను హ్యాక్ చేసి వీడియోల్ని సేకరించాడని.. నటుడు నిఖిల్ ఫోన్ లోని ప్రైవేటు ఫోటోలు.. వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్కులో ఉన్నట్లుగా ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తనకు తెలీకుండా మస్తాన్ సాయి తన వ్యక్తిగత వీడియోలు తీశాడని.. వాటి గురించి ప్రశ్నిస్తే లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపించారు.
మస్తాన్ సాయి అక్రత్యాలు ఉన్న హార్డ్ డిస్కును గత ఏడాది నవంబరులోనే తాను తీసుకున్నట్లుగా పేర్కొన్న లావణ్య.. దీంతో తన ఇంటిపై దాడి చేసి.. తనను అంతం చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఈ కంప్లైంట్ నేపథ్యంలో హత్యాయత్నం.. మహిళల వ్యక్తిగత వీడియోల చిత్రీకరణ.. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించటం తదితర సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అసలేం జరిగింది? లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్కులో అసలేముంది?లాంటి వివరాలు బయటకు రావాల్సి ఉంది.