మెగాస్టార్ చిరంజీవి తరం తర్వాత.. టాలీవుడ్లో టాప్ స్టార్లుగా వెలుగొందిన హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక టైంలో వీళ్లిద్దరూ టాలీవుడ్లో నంబర్ వన్ స్థానానికి పోటీ పడ్డారు. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఈ టాప్ స్టార్లతో వరుసగా సినిమాలు తీసే అవకాశం రావడం అంటే అరుదైన విషయమే. సింగనమల రమేష్ అనే ఫైనాన్షియర్ నిర్మాతగా మారి ఈ ఇద్దరు హీరోలతో కొమరం పులి, ఖలేజా చిత్రాలు ప్రొడ్యూస్ చేశాడు.
కానీ, ఆ రెండు సినిమాలు అనివార్య కారణాలతో ఆలస్యమయ్యాయి. చాలా లేటుగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర కూడా నిరాశాజనక ఫలిలతాన్నందుకున్నాయి. దీంతో రమేష్ నిండా మునిగిపోయాడు. తర్వాత సినిమాలే తీయలేదు. కాగా ఆయన మీద ఒక ల్యాండ్ డీల్‌కు సంబంధించి కోర్టులో కేసు పడడం.. ఫలితంగా 74 రోజుల పాటు జైల్లో కూడా ఉండడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో న్యాయపోరాటం చేసిన రమేష్.. తాజాగా నిర్దోషిగా బయటికి వచ్చాడు. కేసును కోర్టు కొట్టేసింది.
ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి సంచలన రీతిలో సమాధానాలు చెప్పాడు రమేష్. కొమరం పులి, ఖలేజా సినిమాల వల్ల ఎంత నష్టం వచ్చింది.. హీరోలేమైనా సాయం చేశారా అని అడిగితే.. ‘‘ఈ రెండు చిత్రాలకు కలిపి నేను వంద కోట్లు నష్టపోయాను. ఆ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో పూర్తయ్యేవి. కానీ ఈ రెండు చిత్రాలు రకరకాల కారణాల వల్ల ఒక్కోటి మూడేళ్లు నిర్మాణం జరుపుకున్నాయి.
‘కొమరం పులి’ చేస్తున్నపుడే కళ్యాణ్ గారు ‘ప్రజారాజ్యం’ పార్టీ కోసం పని చేశారు. దాని వల్ల అది ఆలస్యం అయింది. ‘ఖలేజా’ కూడా రకరకాల కారణాలతో లేటైంది. దీని వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. ఈ సినిమాలు సరైన ఫలితాన్ని అందుకోకపోవడంతో వంద కోట్ల నష్టం వాటిల్లింది. కానీ వాటి హీరోలు నాకు ఎలాంటి సాయం చేయలేదు. కనీసం ఫోన్ చేసిన పాపాన పోలేదు’’ అని రమేష్ వర్మ అన్నాడు. ఐతే ఈ వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించాడు. రమేష్‌కు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ‘కొమరం పులి’ ఆలస్యం అయిందని.. ఎంతో విలువైన పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు వందల కొద్దీ వేస్ట్ అయ్యాయని.. ఇందుకు తాను ప్రత్యక్ష సాక్షినని.. ఇప్పుడిలా మాట్లాడ్డం సరికాదని వ్యాఖ్యానించాడు.