అందరు హీరోలకూ బయట ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనూ భారీగా అభిమాన గణం ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. 24 క్రాఫ్ట్స్‌లోనూ ఆయన్ని అభిమానించే వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ సినిమాను ఏలుతున్న సందీప్ రెడ్డి వంగ సైతం మెగాస్టార్‌కు వీరాభిమాని అనే విషయాన్ని గతంలోనే కొన్ని సందర్భాల్లో వెల్లడించాడు.
ఇప్పుడు మరోసారి తన అభిమానాన్ని చాటుతూ.. తన ఇంట్లో పెట్టుకున్న చిరంజీవి ఫొటోను జనాలకు పరిచయం చేశాడు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న చిరు ఇంటెన్స్ లుక్ తాలూకు ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది సందీప్‌కు చిరు మీద ఉన్న అభిమానాన్ని చాటుతోంది. అదే సమయంలో పర్టికులర్‌గా ఈ లుక్‌ను ఫొటోగా పెట్టుకోవడం గురించి చర్చించుకుంటున్నారు.
చిరు కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఎన్నో పాపులర్ లుక్స్ ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ‘ఆరాధన’ సినిమాలోని ఒక సన్నివేశం నుంచి క్యాప్చర్ చేసిన లుక్‌ను సందీప్ ఫొటోగా మార్చుకోవడం విశేషం. నటుడిగా చిరులోని ప్రత్యేకతను చాటే సన్నివేశమది. చిరు అందులో పులి రాజుగా మూర్ఖత్వం నిండిన పాత్రలో నటించాడు. అతడిలో మార్పు తీసుకొచ్చే టీచర్ పాత్రను సుహాసిని చేసింది. ఓ సన్నివేశంలో మూర్ఖంగా ప్రవర్తించిన చిరును సుహాసిని చెంపదెబ్బ కొడుతుంది.
అప్పుడు చిరు ఇచ్చే ఎక్స్ప్రెషన్నే సందీప్ క్యాప్చర్ చేశాడు. పైకి మూర్ఖుడిగా కనిపించినా.. లోపల తనలో ఒక సున్నితమైన మనిషి ఉన్నాడని చాటే సన్నివేశం అది. ఆ సన్నివేశంలో చిరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అద్భుతమనే చెప్పాలి. చిరును అందరూ పెద్ద స్టార్‌గా చూస్తారు కానీ.. ఆయన అద్భుతమైన నటుడు అని ‘ఆరాధన’ లాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఆ పాత్రలో చిరు గొప్ప నటనకు ఫిదా అయిన సందీప్.. సదరు సన్నివేశం నుంచి చిరు ఎక్స్ప్రెషన్ను ఫొటోగా క్యాప్చర్ చేసి చిరు మీద తన అభిమానాన్ని, తన సునిశత దృష్టిని చాటుకున్నాడు. ఇంత అభిమానం ఉన్న సందీప్.. చిరుతో ఓ సినిమా చేస్తే మోత మోగిపోతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.