పద్ధతికి చీర కడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సాయి పల్లవి. ఇండియా వైడ్ గా ఎందరో హీరోయిన్లు ఉన్నారు కానీ.. వారిలో సాయి పల్లవి చాలా ప్రత్యేకం. మేకప్ లేకుండా నటించే వన్ అండ్ ఓన్లీ బ్యూటీ. పారితోషికం కన్నా.. కథకు, కథలోని తన పాత్రకు అధిక ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి `అర్జున్ రెడ్డి` వంటి బోల్డ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే ఎలా ఉంటుంది? అమ్మ బాబోయ్ ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. కానీ అటువంటి భయంకరమైన ఆలోచన చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
అర్జున్ రెడ్డి మూవీతో సందీప్ రెడ్డి డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించారు. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి వరకు వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఒక ఎత్తైతే.. అర్జున్ రెడ్డి మరొక ఎత్తు. లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ ఈ చిత్రంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి అర్జున్ రెడ్డిలో ఫీమెయిల్ లీడ్ కోసం పరిశీలిస్తున్నప్పుడు సందీప్ రెడ్డి వంగాకు సాయి పల్లవి పేరు మదిలోకి వచ్చిందట. ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు కూడా చేశారట.
తాజాగా `తండేల్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని సందీప్ రెడ్డి బయటపెట్టారు. అర్జున్ రెడ్డి లో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలన్న ఆలోచనతో కేరళకు చెందిన కో-ఆర్డినేటర్ కు కాల్ చేయగా.. `ఆ విషయం మరిచిపోండి, కనీసం స్లీవ్ లెస్ దుస్తుల్లో ధరించడానికే ఆ అమ్మాయి ఇష్టపడదు. ఇక మీరు అనుకున్న పాత్రను ఏం చేస్తుంది` అని చెప్పాడట. దాంతో కథ పట్టుకుని సాయి పల్లవి వద్దకు వెళ్లే సాహసం సందీప్ రెడ్డి వంగా చేయలేదు.
అయితే `మొదట్లో ఇలాగే అంటారు. ఆ తర్వాత పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు వస్తే మాత్రం ఎలాంటి రోల్స్ అయినా చేసేస్తారు` అని ఆ సమయంలో సందీప్ రెడ్డి అనుకున్నారట. కానీ పదేళ్లు గడుస్తున్నా సాయి పల్లవిలో మార్పు రాలేదు.. నిజంగా గ్రేట్ అంటూ తండేల్ ఈవెంట్ లో సందీప్ రెడ్డి ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇదే అంశంపై సాయి పల్లవి కూడా రియాక్ట్ అయింది. `అర్జున్ రెడ్డిలో విజయ్, షాలిని చాలా అద్భుతంగా నటించారు. సినిమా ఎలా రావాలని ఉందో అలానే వచ్చింది. అలాగే ఎవరు ఏ మూవీ చేయాలని రాసి ఉంటే వాళ్లే చేస్తారు` అని సాయి పల్లవి వ్యాఖ్యానించింది.