కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకురావడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని మహాయుతి కూటమి గెలుపులో ముఖ్య భూమిక వహించిన చంద్రబాబు…తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ప్రచారం సందర్భంగా దుమ్ము రేపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం జగన్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ లకు లింకు పెడుతూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రజలు జగన్ ను ఓడించిన మాదిరిగానే కేజ్రీవాల్ నూ ఢిల్లీ ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్, కేజ్రీవాల్ ఇద్దరు ప్రజల సొమ్ము దోచుకొని విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ది హాఫ్ ఇంజన్ సర్కార్ అని, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు చెప్పారు. పాలనా వైఫల్యంతో పదేళ్లుగా ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని, ప్రపంచంలోనే అత్యధిక వెదర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఉందని సెటైర్లు వేశారు. కేజ్రీవాల్ మాయమాటలతో ప్రజలను కలుషితం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీలో చాలా గల్లీల్లో మురికినీరు, మంచి నీరు కలిసిపోయిందని, దాంతో, చాలామంది ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారని ఆరోపించారు. యమునా నది పూర్తిగా కలుషితమైందని, వాయు కాలుష్యం తీవ్రత వల్ల ఢిల్లీకి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఢిల్లీలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా, జగన్ మాదిరిగా కేజ్రీవాల్ పాలన కూడా ఉందన్న వాదనను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.