కొందరు స్టార్ హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు.. ప్రత్యేకంగా అభిమానుల కోసం సమావేశాలు నిర్వహించడం చూస్తుంటాం. షూటింగ్ జరుగుతున్న ప్రదేశం లేదా ఇంకేదైనా లొకేషన్ ఎంచుకుని ఫొటోలకు అవకాశం ఇస్తుంటారు. ఇది ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంటుంది. దీంతో పాటు ప్రెస్ మీట్లు జరిగినపుడు కొందరు అభిమానులు అక్కడికి చేరుకుని తమ అభిమాన కథానాయకుడిని కలుసుకుంటూ ఉంటారు.
ఐతే టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ కొత్త సినిమా రిలీజ్ ఏమీ లేకపోయినా.. అభిమానులను కలిసేందుకు ఒక స్పెషల్ మీట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఒక ప్రకటన రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. పోలీసుల అనుమతులు తీసుకుని మరీ ఒక మీట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తారక్ ఈ ప్రకటనలో వెల్లడించాడు.
తారక్ యథాలాపంగా ఈ ప్రకటన చేయలేదు. రాజశేఖర్ అనే తారక్ వీరాభిమాని ఒకరు ట్విట్టర్లో పెట్టిన పోస్టును చూసి తారక్ స్పందించడం విశేషం. అభిమానులు తమ ఆరాధ్య కథానాయకుడిని చూసేందుకు ఎంత తపన పడతారో వెల్లడిస్తూ.. 101 మంది తారక్ ఫ్యాన్స్ తిరుమల నుంచి పాదయాత్ర చేసుకుంటూ తారక్ వద్దకు వస్తున్న విషయాన్ని వెల్లడించాడు. హీరోల కోసం ఎంతో చేసే అభిమానులు.. కోరుకునేదల్లా వారి నుంచి కాస్త సమయం, ఒక కలయిక, కాస్త గుర్తింపు మాత్రమే అంటూ అభిమానుల కోణాన్ని ఇందులో తెలియజేశాడు ఆ నెటిజన్. ఈ పోస్టేమీ అంతగా వైరల్ కాలేదు.
కానీ అది ఎలాగో తారక్ వద్దకు చేరింది. ఎవరో ఫ్యాన్ పోస్టు పెడితే ఏంటి అనుకోకుండా ఎన్టీఆర్ వెంటనే స్పందించి ఒక ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అభిమాని మాటకు విలువనిచ్చి ఫ్యాన్స్ మీట్‌కు అనుమతులు తీసుకుని మరీ కలుస్తానని తారక్ చెప్పడం ఫ్యాన్స్ అందరినీ అమితానందానికి గురి చేస్తోంది. దీన్ని బట్టి తారక్ పీఆర్ టీం సోషల్ మీడియాను ఎలా ఫాలో అవుతుందో.. అభిమానుల ఆకాంక్షల్ని ఎలా గుర్తించే ప్రయత్నం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.