ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆయనపై పోలీసు కేసు నమోదు అయింది. 1999లో విడుదలైన హిట్ మూవీ `స్వయంవరం` తో వేణు హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆపై మనసు పడ్డాను కానీ, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ ఇలా వరుస చిత్రాలు చేస్తూ అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు. 2007 వరకు ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు గ్రాఫ్ ఆ తర్వాత క్రమంగా డౌన్ అయింది. హీరోగా ఫేడౌట్ అయ్యాక వేణు వ్యాపార రంగంలో బిజీ అయ్యారు.
2022లో `రామారావు ఆన్ డ్యూటీ`తో వేణు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ఈ సంగతి పక్కన పెడితే.. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఫ్యామిలీ మెంబర్స్ నిర్వహిస్తున్న `ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్` సంస్థలో ప్రతినిధిగా వేణు వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను టీహెచ్‌డీసీ(తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా సొంతం చేసుకుంది.
ఆ తర్వాత ఈ కాంట్రాక్ట్ ను వేణు మరియు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులు కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ గా ఇచ్చారు. అయితే పలు కారణాల వల్ల స్వాతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్యలోనే తప్పుకోవడంతో.. 2022లో రిత్విక్ సంస్థ ఒక్కటే పనులు ప్రారంభించింది. ఇదే సమయంలో టీహెచ్‌డీసీ తో తలెత్తిన విభేదాల వల్ల ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ నిర్వాహకులు రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్నిరద్దు చేశారు.
దీంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ పోలీసులను ఆశ్రయించారు. తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ వేణు మరియు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ నిర్వాహకులపై రవికృష్ణ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తాజా ఆదేశాల మేరకు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కరరావు హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్ తో పాటు నటుడు వేణుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.