గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగులేని నాయకుడిగా చెలామణీ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన నాయకుడు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడిగా సుపరిచితులైన నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఆయన్ను ఉద్దేశిస్తూ.. ‘‘అడవిదొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ అని వ్యాఖ్యానించారు.
జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల దగ్గర నిర్వహించిన భారీ బహిరంగ సభలో నాగబాబు నిప్పులు చెరిగారు. పెద్దిరెడ్డికి ఎవరూ భయపడటం లేదని.. ఆయన అన్యాయాలు.. అక్రమాలు అన్నీఇన్నీకావన్న నాగబాబు.. ‘‘పెద్దరెడ్డికి ఇక్కడ ఎవరూ భయపడటం లేదు. భూకబ్జాలు చేసి మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లను దగ్థం చేయించారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించుకున్నారు.
పాలను తక్కువ ధరకే అమ్మాలని పాడి రైతుల్ని బెదిరించారు. అటవీ శాఖ భూముల్ని ఆక్రమించి ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయించుకున్నారు. వైసీపీలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు.
నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే బహిరంగ సభను నిర్వహించటం ద్వారా.. ఆయన అధిపత్యానికి గండి పడిందన్న సంకేతాలు ఇవ్వటమే లక్ష్యంగా చెబుతున్నారు.
పెద్దిరెడ్డిని ఎన్నికల్లో గెలిపించి ఎమ్మెల్యేను చేసినప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి కదా? అని ప్రశ్నించిన నాగబాబు.. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ అవుతుందన్న జోస్యాన్ని చెప్పుకొచ్చారు. విజయసాయి రెడ్డి పార్టీని వదిలి వెళ్లారని.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో ఒక్కరు ఉండరన్న నాగబాబు.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు.
అధికారంలోకి తాము వచ్చి ఏడు నెలల్లో ఏమీ చేయలేదని ప్రతిపక్ష నేతలు తమను తప్పు పడుతున్నారని.. ముందు వారంతా అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నాగబాబుకు వైసీపీ నేతలు ఏ రీతిలో రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.