ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నందిగామ. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వైసీపీ గత 2019 ఎన్నికల్లో విజయందక్కించుకుంది. మొండితోక జగన్మోహన్రావు గెలుపు గుర్రం ఎక్కారు. ఇదే కుటుంబా నికి చెందిన జగన్ సోదరుడికి అప్పటి సీఎం జగన్.. ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. నందిగామ మనదే అన్న ట్టుగా పనిచేయాలని సూచించారు. అయితే.. తాజాగా జరిగిన స్థానిక కోటా చైర్ పర్సన్ ఎన్నికలో మాత్రం ఈ ఇద్దరు సోదరుడు చేతులు ఎత్తేశారు.
వైసీపీకి చెందిన లక్ష్మి అనే మహిళ.. చైర్ పర్సన్ గా బరిలో నిలిచారు. సోమవారం జరగాల్సిన ఎన్నిక టీడీపీ అంతర్గత కుమ్ములాటతో వాయిదా పడి.. మంగళవారం నిర్విఘ్నంగా ముగిసింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన లక్ష్మికి కేవలం మూడంటే మూడు ఓట్లే వచ్చాయి. మరి దీనిని ఎలా చూడాలి. వాస్తవానికి ఇక్కడ వైసీపీదే బలం అన్న విషయం తెలిసిందే. కానీ, చివరకు చైర్ పర్సన్ ఎన్నిక విషయానికి వస్తే.. మాత్రం మొండితోక బ్రదర్స్ కాడి పడేశారు.
పైగా.. చైర్ పర్సన్ గా బరిలో నిలిచిన లక్ష్మి కూడా.. తన ఓటు తాను వేసుకోకుండా.. తటస్థంగా ఉండిపో యారు. దీంతో నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిలబెట్టిన మహిళా అభ్యర్థి విజయం దక్కించు కున్నారు. గెలుపు-ఓటములను పక్కన పెడితే.. అసలు వైసీపీ తరఫున బలమైన ప్రయత్నం చేసిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. తిరుపతిలో కనీసం ప్రయత్నం చేశారు. చివరి వరకు వైసీపీని గెలిపించే ప్రయత్నం అయినా.. జరిగింది. కానీ, ఆ తరహా ప్రయత్నాలు ఇక్కడ జరగలేదు.
దీనికి కారణం.. మొండితోక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలే కారణమని తెలుస్తోంది. ముందుగా ఆయనను నిలువరించడంలోనే ఎమ్మెల్యే సౌమ్య విజయం దక్కించుకున్నట్టు అయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇసుక, మద్యం కుంభకోణాల్లో మొండితోక ప్రమేయం ఉందని వైసీపీ అదికారంలో ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి. ఇక, జగనన్న ఇళ్లకు సంబంధించిన కేటాయింపుల్లోనూ.. ఆయన చేతి వాటం ప్రదర్శించారన్న వాదన కూడా ఉంది. వెరసి.. ఇవన్నీ.. ఇప్పుడు మెడకు చుట్టుకుంటాయని భావించి.. ఆయన సహా సోదరుడు సైలెంట్ అయిపోయారని వైసీపీ టాక్.