ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో పర్యటించిన లోకేష్.. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. ఏపీకి సంబంధించి న ప్రాజెక్టులకు నిధులు, అనుమతులపై వారితో చర్చించారు. అనంతరం.. ప్రత్యేకంగా ఓ హోటల్లో ప్రశాంత్ కిషోర్‌తోనూ నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో ఏపీ రాజకీయాలతోపాటు టీడీపీ భవిష్యత్తు రాజకీయాలపైనా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పీకేతో చర్చించారని తెలిసింది.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ.. తెలంగాణలోనూ విస్తరించాలని భావిస్తోంది. దీనిపై కసరత్తు చేసి న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పెండింగులో ఉంది. అదేసమయంలో పార్టీ యాక్టివి టీ కూడా పెద్దగా లేదు. ఏపీతో పోల్చుకుంటే 20 శాతం జోష్ మాత్రమే తెలంగాణలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నది చంద్రబాబు వ్యూహం. ముఖ్యంగా బీసీలను ఆకట్టుకునేలా.. ఇక్కడ పార్టీ తరఫున కార్యక్రమా లు నిర్వహించాలని గతంలోనే చెప్పుకొచ్చారు. కానీ, ఏపీలో సర్కారు దూకుడు, అభివృద్ధి వంటి కార్యక్రమాల నేపథ్యంలో మళ్లీ తెలంగాణపై దృష్టి పెట్టలేక పోయారు.
పైగా తెలంగాణలో పార్టీని డెవలప్ చేయాలన్న ఉద్దేశం ఉన్నా ఎక్కడ నుంచి మొదలు పెట్టాలన్న అంశంపై తర్జనభర్జన ఉంది. కొన్నాళ్ల కిందట జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం అక్కడ పనిచేసింది. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చినా.. టీడీపీ తరఫున ఇంకా కార్యాచరణ ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్‌తో బేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏవిధంగా పార్టీ ముందుకు సాగాలి? ఏయే వ్యూహాలు అనుసరించాలన్న విషయాలపైనే లోకేష్ చర్చించినట్టు జాతీయ స్థాయిలో పనిచేస్తున్న తెలుగు మీడియా పేర్కొనడం గమనార్హం.
గత 2024 ఏపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేరుగా టీడీపీకి పనిచేయకపోయినా.. ఆయన పరోక్షంగా వైసీపీపై ప్రభావం చూపించేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై విమర్శలు చేశారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత.. ఇప్పుడు మరోసారి నారా లోకేష్ తో భేటీ కావడంతో తెలంగాణపైనే వ్యూహాలు సిద్ధం చేయిస్తున్నారన్న చర్చ తెరమీదికి వచ్చింది. కాగా.. రాబిన్ శర్మ బృందం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయనుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.