ఏపీ సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత ఐటీ రంగం డెవలప్ అవుతుందని ముందుగానే ఊహించిన చంద్రబాబు..తాజాగా డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తును ఏలబోతోందని గ్రహించారు. ఈ క్రమంలోనే అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించి అక్కడే డ్రోన్ల హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. డ్రోన్లను ఉపయోగించి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానని చంద్రబాబు కొద్ది రోజుల క్రితం చెప్పారు. అన్న మాట ప్రకారం డ్రోన్లతో మందుబాబులను చంద్రబాబు ఈ రోజు పరిగెత్తించారు.
డ్రోన్ల ద్వారా గంజాయి పంట గుట్టురట్టు చేసిన పోలీసులు తాజాగా మందుబాబుల భరతం పట్టారు. అనంతపురం జిల్లాలో డ్రోన్ల ద్వారా మందుబాబుల జాడ పసిగట్టిన పోలీసులు వారిని పరిగెత్తించారు. బహిరంగ ప్రదేశాల్లో పట్టపగలు ఊటుగా తాగుతున్న మందుబాబులను పోలీసులు పట్టుకున్నారు. డ్రోన్లు తమను తరమడంతో పొలాలలో, కాలువ గట్ల మీద, రైల్వే ట్రాక్ ల సమీపంలో మందుబాబులు పరుగు లంఘించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొరికిన మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరికొందరు పారిపోయారు. ఇలా డ్రోన్లను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మందు సేవించేవారు, డ్రగ్స్ సేవించే వారు, డ్రగ్స్ అమ్మేవారి ఆట కట్టిస్తామని పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతో, చంద్రబాబు చెప్పింది చేశారని, డ్రోన్లతో ఇన్విజిబుల్స్ పోలీసింగ్ ద్వారా క్రిమినల్స్ ఆటకట్టిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.