ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఏపీలో ఉన్న కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పెట్టెబేడె సర్దుకొని వెళ్లిపోతుంటే….మరోవైపు వైసీపీ నేతలు మాత్రం పాలనా రాజధాని విశాఖ కొత్త కంపెనీలతో విరాజిల్లుతోందంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కొత్త కంపెనీల మాట దేవుడెరుగు…కనీసం ఆల్రెడీ ఉన్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా కాపాడడం ప్రభుత్వ కనీస బాధ్యత.
కానీ, ఆ కనీస బాధ్యతను నెరవేర్చడంలోనూ జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు, టీడీపీ నేతల వ్యాపారాలు దెబ్బకొట్టి వారిపై కక్ష సాధించడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్న వైనంపైనా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ ను జగన్ టార్గెట్ చేశారని విమర్శలు గతంలో వచ్చాయి. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో గల్లా జయదేవ్ క్రియాశీలకంగా ఉంటూ పోరాటం చేయడంతో పాటు టీడీపీ ఎంపీ కావడంతోనే ఆయనను జగన్ టార్గెట్ చేశారని టాక్.
ఈ క్రమంలోనే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తిరుపతి సమీపంలోని కరకంబాడిలో అమరరాజా కంపెనీకిచ్చిన 244.38 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు జగన్ సర్కార్ రెడీ అయింది. ఆ భూముల్లో అమరరాజా సంస్థ ఎలాంటి విస్తరణ పనులు చేపట్టనందున అమరరాజా సంస్థకు నోటీసులు పంపారు. దీంతో, ఈ వ్యవహారంపై ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే అమరరాజా సంస్థకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు…. ఆ భూముల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని తాజా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అమరరాజా సంస్థపై ఎలాంటి వేధింపులకు పాల్పడరాదని అధికారులకు స్పష్టం చేసింది. దీంతో, ఈ వ్యవహారంలో అమరరాజా సంస్థకు ఊరట లభించగా…జగన్ కు షాక్ తగిలినట్లయింది.
కాగా, జగన్ దెబ్బకు తట్టుకోలేక గతంలో అమరరాజా బ్యాటరీస్ సంస్థ చిత్తూరులో విస్తరించాలనుకున్న ‘అడ్వాన్స్ డ్ లిథియం టెక్నాలజీ రీసెర్చ్ హబ్’ తమిళనాడుకు తరలిపోవడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ తరలింపు తర్వాత చిత్తూరులోని ప్రధాన సంస్థను కూడా తమిళనాడుకు తరలించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకారం తమిళనాడు సీఎం స్టాలిన్ తో అమరరాజా యాజమాన్యం చర్చలు జరిపిందని, అమరరాజా సంస్థకు స్టాలిన్ రెడ్ కార్పెట్ పరచారని తెలుస్తోంది. అమరరాజా సంస్థ ఏర్పాటుకు ఇప్పటికే స్ధలం కూడా కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.