సాధారణ ఎన్నికల్లో అనేక మంది విజయం దక్కించుకున్నారు. అదేసమయంలో ఎంతో మంది ఓడిపో యారు. సాధారణంగా గెలిచిన వారికి ఉండే క్రేజ్..ఓడిన వారికి ఉండదు. అసలు ఓడిన వారిని ఎవరూ పట్టించుకోరు కూడా. కానీ.. ఎక్కడో ఒకరిద్దరి విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం తమిళనాడుకు దక్కింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఖాయమైంది.
వాస్తవానికి ఈయన తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కోయంబత్తూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు.. ఒక పోలింగ్ బూత్‌లో కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. ఇది సంచ లనంగా మారి.. వార్త రూపంలోనూ బయటకు వచ్చింది. మరి అలాంటి నాయకుడిని ఎవరైనా పట్టించు కుంటారా? అంటే.. మోడీ పట్టించుకున్నారు.తన మంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించారు. మాజీ ఐపీఎస్ అదికారి అయిన.. అన్నా మలైను ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వరించింది.
తాజాగా ఆయనకు ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు సమాచారం అందించాయి. అయితే.. ఇంతగా ఆయనను నెత్తిన పెట్టుకుని.. పదవి ఇవ్వడానికి కారణం.. తాజా ఎన్నికల్లో అన్నామలై ఓటమిపాలైనా రాష్ట్రాధ్యక్షుడిగా తమిళనాడులో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. అలుపెరుగకుండా పోరాడారు. పాదయాత్ర కూడా చేశారు. అంతేకాదు.. 2019లో 3 శాతం మేర ఉన్న బీజేపీ ఓటు బ్యాంకును 11 శాతానికి చేర్చారు. దీంతో అసలు పార్టీ మనుగడసాధ్యమేనా? అని అనుకున్న వారంతా ఆశ్చర్య పోయేలా చేశారు.
ఫలితంగా అన్నామలై.. మోడీ దృష్టిలో పడ్డారు. ఆదినుంచి ఆయన పట్ల అభిమానం పెరిగేలా చేసింది. ఈ కారణంగానే ఆయనకు కేబినెట్లో చోటు కల్పించారు. ఇక,ఏపీలోనూ గెలిస్తే చాలనుకున్న నాయకుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రంలో జెండా మోసి.. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వర్మ.. ఆర్ ఎస్ ఎస్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన నరసాపురం నుంచి విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈ ఆనందాన్ని పట్టలేక ఆయన కన్నీరు పెట్టేసుకున్నారు.