ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం విలన్ గా, సహాయక నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీకాంత్ గురించి పరిచయాలు అక్కర్లేదు. సహ నటి ఊహను శ్రీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం కాగా.. ఇప్పటికే శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది నటులతో శ్రీకాంత్ కు బంధుత్వం ఉంది. హీరో గోపీచంద్, శ్రీకాంత్ దగ్గర రిలేటివ్స్. శ్రీకాంత్ మేనకోడలనే గోపీచంద్ వివాహం చేసుకున్నాడు. అలాగే శ్రీకాంత్ చెల్లెలు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ నటి. ఇంతకీ ఆమె మరెవరో కాదు అనితా చౌదరి.
టీనేజ్ లోనే యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనితా.. ఆ తర్వాత పలు సీరియల్స్, సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన `ఛత్రపతి` చిత్రంలో సూర్యుడు తల్లి పాత్రలో అంధురాలిగా అనిత నటించిన తీరు ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేరు. అలాగే మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల, వరుడు, మన్మధుడు.. ఇలా అనేక చిత్రాల్లో అనితా చౌదరి నటించారు.
బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియల్స్ లోనూ భాగమయ్యారు. ప్రస్తుతం అడపా తడపా సినిమాల్లో కనిపిస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్నారు. ఇకపోతే అనితా చౌదరి, నటుడు శ్రీకాంత్ బంధువులని బహుశా చాలా మందికి తెలియదు. అనితా 2005లో కృష్ణ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కృష్ణ చైతన్య మరియు శ్రీకాంత్ కజిన్స్ అవుతారు. కృష్ణ చైతన్యతో పెళ్లి చేసుకోవడంతో శ్రీకాంత్ కు అనిత వరసకు చెల్లెలు అయ్యారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనితా చౌదరి స్వయంగా రివీల్ చేయడం విశేషం.