గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీతో వైసీపీ సత్సంబంధాలు నెరపిన సంగతి తెలిసిందే. జగన్ గెలుపు వెనుక ప్రధాని మోడీ అండ్ కో హస్తం ఉందని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, కొంతకాలంగా ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు చెడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నిన్న విశాఖలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటించిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఇన్నాళ్లూ పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు ఈ సారి డైరెక్ట్ గా ఎటాక్ మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే జగన్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యల్లో మాత్రం ఏపీ 3వ స్థానంలో ఉంది. సిగ్గుగా అనిపించడం లేదా జగన్..అని అమిత్ షా షాకింగ్ కామెంట్లు చేశారు. గత నాలుగేళ్లుగా ఏపీలో కుంభకోణాలు, అవినీతిమయం అని షా విమర్శలు గుప్పించారు. విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని, తొమ్మిదేళ్లలో ఏపీకి 5 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా అన్నారు.
ఆ డబ్బంతా ఎటు పోయింది? డెవలప్ మెంట్ ఏమైందని ప్రశ్నించారు. వైసీపీది రైతు సంక్షేమ ప్రభుత్వమని జగన్ చెబుతున్నారని, రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. రైతులకు కేంద్రం ఇస్తున్న డబ్బులను తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యంపై కూడా జగన్ ఫొటోలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.